బాబు బొమ్మ ఉంటే.. రైట్‌ రైట్‌..!

21 Mar, 2018 11:37 IST|Sakshi
చంద్రన్న సంచార చికిత్స వాహనం

ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్‌లు లేకుండా తిరుగుతున్న చంద్రన్న సంచార చికిత్స వాహనాలు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ

నాలుగేళ్లుగా ఫిట్‌నెస్‌లు నిల్‌

చంద్రబాబు ఫొటోలు, పేర్లతో తిరుగుతుండటంతో పట్టించుకోని అధికారులు

డొక్కు వాహనాల్లో భద్రత కరువైందని ఉద్యోగుల ఆవేదన

ఆందోళనకు సిద్ధమవుతున్న వైనం

తాళ్లూరు: పేదల చెంతకే వైద్య సేవలు అనే ఉన్నత లక్ష్యంతో నడుస్తున్న చంద్రన్న సంచార చికిత్స వాహనాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. ఆయా వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్న పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఆయా సేవలు అందకపోగా, డొక్కు వాహనాలు ప్రమాదాలను తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా వాహనాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు భయపడుతున్నారు. చేసేది లేక ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేందుకు 2008లో ‘104’ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో విజయవంతంగా కొనసాగిన ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధిపొందుతూ వచ్చారు. అనంతరం 2010లో డీఎస్సీ ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ (ఆర్‌ఓఆర్‌) జీఓ నంబర్‌ 3 ప్రకారం 104 వాహనాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు చెల్లించారు. 2014 వరకూ ఈ పథకం సక్రమంగానే సాగింది. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలకు పేర్ల మార్పులో భాగంగా 104 పథకానికి కూడా చంద్రన్న సంచార చికిత్స వాహనంగా పేరు మార్చారు. వీటి నిర్వహణను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానంలోకి మార్చి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్‌ బాధ్యతలు అప్పగించారు.

అమలుకాని ఉత్తర్వులు...
పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్‌ బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో 277 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉండగా, మన జిల్లాలో 20 వాహనాల ద్వారా సేవలు ప్రారంభించారు. వాటిలో పనిచేసే ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న మినిట్స్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ (ఎంఓయూ) ప్రకారం ప్రభుత్వ కార్మిక చట్టాలు, అవుట్‌ సోర్సింగ్‌కు ఇచ్చే ఆర్థికశాఖ ఉత్తర్వులు అమలు చేయాలి. కానీ, అవేమీ అమలు చేయడం లేదు.

నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వాహనాలు...
చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఇతర అన్ని వాహనాల మాదిరిగానే ఆర్‌సీ, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, మరమ్మతులు చేయించాలి. కానీ, రాష్ట్రంలోని 277 వాహనాలకు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, ట్యాక్సులు, మరమ్మతులు లేవు. కనీసం జనరల్‌ చెకప్, మైనర్‌ మరమ్మతులు కూడా  చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా వాహనాలలో సీలింగ్‌ ఊడిపోయింది. లైట్లు పనిచేయక రోగులను పరీక్షించే సమయంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బ్రేకులు కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి నెలకొనడంతో వాటిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాలు పొంచి ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలు చోట్ల డ్రైవర్లకు జరిమానా...
వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వాహన డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ జరిమానా విధిస్తోంది. ఏళ్ల తరబడి కనిపెట్టుకుని ఉన్న డ్రైవర్లపై జరిమానాలు విధిస్తుండటం సిబ్బందిని కలవరపెడుతోంది. జరిమానాలు విధించడంతో పాటు వాహనాలకు మరమ్మతులు చేయించకుండా ప్రమాదాలకు గురిచేయడంపై సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

నేటికీ ఉమ్మడి రిజిస్ట్రేషనే...
రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా చంద్రన్న సంచార చికిత్స వాహనాలు నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఫిట్‌నెస్‌ పరీక్షలు లేకపోవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌పై తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు మరమ్మతులతో పాటు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించి బీమా సౌకర్యం కల్పించాలని, తద్వారా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదం జరిగితే ఇక్కట్లే...
104 వాహనాలలో ఉద్యోగ భద్రత ఉంటుందన్న ఆశతో 11 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,662 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వారిలో జిల్లాలో 120 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే, వాహనాలకు మరమ్మతులు చేయకపోవడంతో పాటు ఎంవీఐల నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిట్‌నెస్‌ గడువు పూర్తయి సామర్థ్య పరీక్షకు సమయానికి రాని వాహనాలకు రవాణాశాఖ రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తుంది. కానీ, ఈ వాహనాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బొమ్మతో పాటు పేరు కూడా రాసుకుని తిరుగుతున్న వాహనాలు కావడంతో డొక్కు వాహనాలైనాగానీ రవాణా శాఖ అధికారులు ఆపే ధైర్యం చేయడం లేదు.

మరిన్ని వార్తలు