రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో మార్పు

20 Nov, 2017 01:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: భూ వినియోగానికి సంబంధించి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయనున్నారు. 630 ఎకరాల అటవీ భూమిని నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్‌ నుంచి ప్రభుత్వ జోన్‌లోకి మార్చాలని ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పీ3 (రక్షిత ప్రాంతం), ఆర్‌1 (విలేజ్‌ ప్లానింగ్‌ జోన్‌), ఆర్‌3 (మీడియం, హై డెన్సిటీ జోన్‌), సీ3 (నైబర్‌హుడ్‌ జోన్‌)లో ఉన్న 630 ఎకరాల అటవీ భూమి ఇక ప్రభుత్వ జోన్‌లోకి వెళ్లనుంది. వివరాలు.. పెనుమాక, నవులూరు, తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని రాజధాని అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని అటవీ సలహా కమిటీ ఇటీవల ఈ భూ వినియోగ మార్పిడికి సూ త్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ భూమిలో 60 శాతాన్ని గ్రీన్‌ జోన్‌గా ఉంచాలని స్పష్టం చేసింది.

అలాగే ఈ భూమిని వాణిజ్య, నివాస భవనాలు, షాపింగ్‌ మాల్స్, హోటళ్లు, లాడ్జిలు వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని తేల్చిచెప్పింది. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ భూమిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ భూమి మొత్తం మాస్టర్‌ ప్లాన్‌లో నివాస, వాణిజ్య నిర్మాణాల జోన్‌లో ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఈ భూమిని ప్రభుత్వ జోన్‌లోకి మార్చుకోవడం ద్వారా వినియోగించుకోవాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో మార్పు చేసినా.. 630 ఎకరాల్లోని అత్యధిక భూమి పర్యావరణ సున్నిత జోన్‌లోనే ఉంది.  

మరిన్ని వార్తలు