ఉమా..నీ తీరు మార్చుకో

12 Aug, 2014 01:29 IST|Sakshi
ఉమా..నీ తీరు మార్చుకో
  •   జిల్లాలో టీడీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి
  •   వైఎస్సార్ సీపీ నాయకుడి హత్య వెనుక ఉమా హస్తం ఉంది...
  •   సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలి
  •   వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
  • నందిగామ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ మంత్రి, బందరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఉమా తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం సారథి, ఉదయభాను, ఎమ్మెల్యే రక్షణనిధి గొట్టుముక్కల వెళ్లి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    అనంతరం నందిగామలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నాయకుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి హత్య చేయడంతో హేయమైన చర్య అని అన్నారు. టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. మంత్రి ఉమ హత్యారాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. ఈ హత్య వెనుక ఉమా పాత్ర ఉందని, ఈ ఘటనపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే కృష్ణారావు మరణించారని పేర్కొన్నారు.

    పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకాయడంతో వైఎస్సార్ సీపీ ఓ మంచి నాయకుడిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగ్గయ్యపేట మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామ మాజీ సర్పంచి మధుసుదనరావును కూడా ఇటీవల టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారని, ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. కృష్ణారావు హత్య కేసులో దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశామని చెప్పారు.

    నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి చెందినప్పటి నుంచి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మంత్రి ఉమా ఈ ప్రాంతాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కృష్ణారావు హత్యపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే రక్షణ నిధి చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు తమ తీరు మార్చుకోకపోతే ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
     
    ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పినట్లుగా పనిచేయాలని ఆదేశించడంతో అధికారులు కార్యకర్తలకు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు, వైఎస్సార్ సీపీ నందిగామ కార్యాలయ ఇన్‌చార్జి మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు