ఇంజనీరింగ్ అడ్మిషన్లలో మార్పులు

25 Jan, 2014 02:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో మార్పులు రానున్నాయి. ఆప్షన్ల నమోదులో స్క్రాచ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉన్నత విద్యాశాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఈ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ విధానంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. గతేడాది రూ.600 ఉన్న కౌన్సెలింగ్ ఫీజు మరింత పెరిగే అవకాశం ఉంది.
 
 అలాగే ఒకసారి ఇచ్చిన ఆప్షన్లను మళ్లీ మార్చుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించి హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో ఏయే మార్పులు తీసుకురావాలన్న అంశాలపై శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్, ఎంసెట్ అధికారులు, ప్రవేశాల క్యాంపు అధికారి రఘునాథ్ తదితరులు సమావేశమై చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మరోసారి చర్చించాక అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు.
 
 కొత్త మార్పులు ఇలా...
 
 విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్లలో కాకుండా ఆప్షన్లను హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఇచ్చుకోవాలి.
 ఒక్కోవిద్యార్థికి గంటన్నర సమయం ఇస్తారు. విద్యార్థితోపాటు ఒక్కరినే హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
 
 దరఖాస్తు చేసుకునే సమయంలోనే విద్యార్థి తన తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఫొటోల్ని అప్‌లోడ్ చేయాలి.
 
 ఆప్షన్ల సమయంలో ఆ ముగ్గురిలో ఎవరో ఒకర్నే విద్యార్థికి సాయంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడే విద్యార్థి.. ఆప్షన్ ఇచ్చుకునే హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
 
 ఆ కేంద్రానికి మాత్రమే వెళ్లి ఆప్షన్ ఇవ్వాలి. ముందుగా సాంకేతిక విద్యాశాఖ అందజేసే ఫారంలో ఆప్షన్లను ఎంపిక చేసుకుని, తర్వాత ఆన్‌లైన్‌లో ఇవ్వాలి. మార్పు చేసుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
 
 హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రస్తుతమున్న 53 నుంచి 93 వరకు పెంచుతారు. మొత్తంగా 2,500 వరకు కంప్యూటర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అదనంగా ఖర్చవుతుంది. దీంతో కౌన్సెలింగ్ ఫీజు పెంచడంతోపాటు ఆప్షన్లు మార్చుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఎంతనేది త్వరలో నిర్ణయిస్తారు.
 

మరిన్ని వార్తలు