అస్థానా తరహాలో అమరావతి

17 Jul, 2016 01:42 IST|Sakshi
అస్థానా తరహాలో అమరావతి

- రాజధాని నిర్మాణంలో మార్పులు
- వాణిజ్య, సర్కారు జోన్‌లో గృహ సముదాయాలు
- కజికిస్థాన్ పర్యటన అనంతరం సీఎం ఆలోచనలు
 
 సాక్షి, హైదరాబాద్ : కజకిస్తాన్ రాజధాని అస్థానా తరహాలో ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏ రంగానికి కేటాయించిన జోన్‌లో ఆ నిర్మాణాలే జరగాలనే నిబంధనల్లో కొంతమేర సడలింపులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ జోన్‌లో ఇతర కార్యకలాపాలకు అనుమతించకూడదని ఇప్పటివరకూ భావించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడమే కాకుండా ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల జోన్ పరిధిలో కొంతభాగం గృహ సముదాయాలకు అనుమతించాలని, అలాగే మరికొంత భాగంలో వాణిజ్య సముదాయాలకు అనుమతించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే వాణిజ్య జోన్‌లో ఇతర కార్యకలాపాలకు, నివాసాలకు అనుమతించకూడదనే ఆలోచనను మార్చుకుం టున్నట్లు వెల్లడించారు. వాణిజ్య జోన్‌లోనూ నివాస సముదాయాలకు కొంతమేర అనుమతించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

 భూగర్భ పార్కింగ్ వసతి
 అస్థానాలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఒక భవనం నుంచి మరో భవనానికి నడిచి వెళ్లేందుకు కారిడార్‌లు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. అమరావతిలోకూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అక్కడ అంతా భూగర్భ పార్కింగేనని  ఇలాంటి ఏర్పాటే ఉండాలని సీఎం యోచిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టపక్కల పూల వనాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు.

మరిన్ని వార్తలు