ఫలించిన భూమా వ్యూహం

14 Jan, 2014 01:13 IST|Sakshi

నంద్యాల, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో రోజు రోజుకూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏళ్ల తరబడి టీడీపీ, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసినా పట్టించుకునే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు, గ్రామీణులు వైఎస్‌ఆర్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం నాయకులు, కార్యకర్తలను తన వైపునకు తిప్పుకోవాలనుకున్న ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి రాజకీయంగా పెద్ద షాక్ తగిలింది. రాజకీయంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి నాయకులకు పెద్ద పీట వేస్తూ, అసంతృప్తి వర్గాన్ని అవమాన పరుస్తూ ముందుకు సాగారు. అలాంటి వారికి భూమా అండగా నిలిచారు. గ్రామంలో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని హామీనిచ్చారు.

 దీంతో గ్రామ నాయకులు నాయకులు శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి, పుల్లారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణ, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జీవరత్నం తదితరులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఎంపీ ఎస్పీవెరైడ్డిని, భూమానాగిరెడ్డిని గ్రామానికి ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. ఐదు దశాబ్ధాల నుంచి గ్రామంలో ఒకే వర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకుల కనుసన్నల్లో పోలింగ్ జరిగేది. అధికార పార్టీకి అండగా ఉంటూ గ్రామంలో ఇతరులను ఎదగనివ్వకుండా చేస్తుండటంతోనే వైఎస్సార్సీపీలో చేరుతున్నామని శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి తదితరులు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భూమానాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇప్పటి వరకు గ్రామంలో మెజార్టీ వస్తుందని ఆశపడిన శిల్పాకు ఇది పెద్ద దెబ్బ.

గ్రామంలో 1600ఓట్లు ఉంటే 1500 ఓట్లు పోలవుతాయి. అందులో 100 నుంచి 200 మధ్యన ఇతర పార్టీల అభ్యర్థులకు పోలయ్యేలా గ్రామ కాంగ్రెస్ నాయకులు వ్యూహం రూపొందించుకున్నారు. వెయ్యి నుంచి 1200మధ్యన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేసేవారు. అయితే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లు ఈ సారి వైఎస్సార్సీపీకి పోలవుతాయని గ్రామ నాయకులు బాహటంగానే పేర్కొంటున్నారు. గ్రామంలో ఏళ్లతరబడి ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు కూలీలు ఎమ్మెల్యే శిల్పాపై ఆగ్రహంతో ఉన్నారు.

మరిన్ని వార్తలు