తరుముతున్న కరువు

21 Jul, 2014 02:25 IST|Sakshi
తరుముతున్న కరువు

అనంతపురం అగ్రికల్చర్ :  జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది. వేరుశనగ, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు లాంటి ప్రధాన పంటలు విత్తుకునేందుకు ఇక పది రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెలాఖరులోగా పంటలు సాగులోకి వస్తేనే అంతో ఇంతో దిగుబడులు వస్తాయి.  కానీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి లక్షలాది హెక్టార్లు బీళ్లుగా మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. పత్తి మినహా మిగతా పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి ఆమడదూరంలో ఉంది. కీలకమైన జూన్, జూలై మాసాల్లో వర్షాలు మొహం చాటేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. జూన్‌లో 63.9 మి.మీకి గాను 50.5 మి.మీ వర్షం పడింది.
 
 అది కూడా  మొదటి వారంలోనే 40 మి.మీ పడటంతో రైతులు పొలాలను దుక్కులు  చేసుకున్నారు. జూలైలో 67.4 మి.మీకి గాను ప్రస్తుతానికి 32.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులోనూ ఈ నెల 6, 7, 8, 10, 11 తేదీల్లో నాలుగైదు మండలాల్లో భారీగానూ, మరికొన్ని మండలాల్లో మోస్తరుగానూ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, 20 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తున్న గాలులకు మేఘాలు తేలిపోతుండడంతో వర్షం కురవడం లేదు. చాలా మండలాల్లో ఇంతవరకు ఒక్క మంచి పదును కూడా కాకపోవడంతో  పంటల సాగు పడకేసింది. జూలై 16 నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 3,01,476 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అందులోనూ వేరుశనగ 2,32,007 హెక్టార్లలో వేశారు.
 
 ఈ ఏడాది జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 9,16,083 హెక్టార్లు. ఇందులో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 6,95,753 హెక్టార్లుగా గుర్తించారు. రైతులు ఎంతో ఆశ పెట్టుకున్న ఆరుద్ర కార్తె జూన్ 20 నుంచి జూలై 5వతేదీతో ముగిసింది. పునర్వసు (పెద్దకుశాలు) కార్తె ఈ నెల 6 నుంచి 20వతేదీతో ముగిసింది. ఈ రెండు కార్తెలు విత్తుకునేందుకు మంచి అదనుగా భావిస్తారు. ఇక జూలై 21న (సోమవారం) పుష్యమి కార్తె (చిన్నకుశాలు) ప్రారంభమై.. ఆగస్టు 5తో ముగుస్తుంది. కొందరు రైతులు ఈ కార్తెలో కూడా విత్తుకునే అవకాశముంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ వేయరు. ప్రస్తుతానికి ఒక్క మండలంలో కూడా సాధారణ విస్తీర్ణంలో పంటలు వేసుకోలేదు. 16 మండలాల్లో మాత్రం 50 శాతం మేర సాగయ్యాయి. శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి, అమరాపురం, రొళ్ల, అగళి, చిలమత్తూరు, నల్లమాడ, కొత్తచెరువు, శింగనమల, గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో కొంత పర్వాలేదనిపిస్తోంది.
 
 అనంతపురం, బుక్కరాయసముద్రం, తాడిపత్రి, పెద్దపప్పూరు, పుట్లూరు, సీకే పల్లి, కనగానపల్లి, కంబదూరు, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, కణేకల్లు, హిందూపురం, పరిగి, కదిరి, ఓడీ చెరువు, పుట్టపర్తి మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వేరుశనగ విషయానికొస్తే.. శెట్టూరు మండలంలో అత్యధికంగా 16,461 హెక్టార్లలో సాగైంది. ఇక్కడ ఈ నెల 5న రాత్రి ఏకంగా 115.4 మి.మీ వర్షం కురవడంతో ఈ మేరకు సాగులోకి వచ్చింది.  ఆ తర్వాత కుందుర్పి మండలంలో 16,250 హెక్టార్లు, గుత్తి 12,885, బ్రహ్మసముద్రం 12,507, బత్తలపల్లి మండలంలో 10,916 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. అమరాపురం, రొళ్ల, నల్లమాడ, కొత్తచెరువు, కూడేరు, వజ్రకరూరు, ధర్మవరం, రాప్తాడు, కళ్యాణదుర్గం మండలాల్లోనూ ఓ మోస్తరు విస్తీర్ణంలో వేరుశనగ వేశారు. మిగిలిన మండలాల్లో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది.
 

>
మరిన్ని వార్తలు