చికెన్‌ ముక్క.. రోగం పక్కా!

2 Sep, 2019 04:24 IST|Sakshi
నెల్లూరులో ఇటీవల దుకాణాల్లో చెడిపోయిన చెన్నై చికెన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

తమిళనాడు నుంచి ఏపీకి నాసిరకం కోడి మాంసం దిగుమతి 

కిలో చికెన్‌ రూ.50కు కొనుగోలు చేసి, ఏపీలో రూ.120కి విక్రయం 

డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన మాంసం ప్రజల కడుపుల్లోకి.. 

అక్రమ దందాకు అడ్డాగా మారిన నెల్లూరు 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఆగస్టు 26వ తేదీన నెల్లూరులోని చికెన్‌ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తొలుత చెన్నై హోల్‌సేల్‌ మార్కెట్‌కు, అక్కడి నుంచి మినీ ఆటోల ద్వారా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు పనికిరాని కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

చెన్నై మార్కెట్‌లో కిలో రూ.50కి కొనుగోలు చేసి, ఏపీలోని పలు ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేరేసరికి కనీసం మూడు రోజుల సమయం పడుతుండటంతో చికెన్‌ పాడైపోతోంది. దానిని స్థానిక వ్యాపారులు ఇక్కడ సిద్ధం చేసిన చికెన్‌లో కలిపి వినియోగదారులకు అంట గడుతున్నారు. నెల్లూరు నగరంలో మూడు చికెన్‌ స్టాళ్లు ఈ అక్రమ దందాకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది.  తమిళనాడు నుంచి ఏపీకి నిత్యం 8 టన్నుల దాకా నాసిరకం చికెన్‌ వస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చికెన్‌ను ప్రధానంగా బార్లు, రెస్టారెంట్లు, రోడ్ల వెంబడి ఉండే చికెన్‌ పకోడి బండ్లకు, ధాబాలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలాగటం ఆడుతున్నారు. 

వాస్తవానికి కోడిని కోసిన తర్వాత మూడు గంటలు దాటితే ఆ మాంసంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాంటి చికెన్‌ తింటే రోగాలు తప్పవు. 24 గంటల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసి చికెన్‌ తిన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు