ఈ కొక్కులను పట్టేదెలా?

22 Jan, 2014 02:57 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిరుపేదల కడుపు నింపాల్సిన చౌక బియ్యం రాజకీయ రాబంధులకు భోజ్యంగా మారుతున్నాయి. చౌక బియ్యాన్ని కాజేసి రైస్ మిల్లుల్లో మళ్లీ పాలీష్ చేసి.. సన్న బియ్యంగా మార్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా బియ్యం స్మగ్లర్లు చెలరేగిపోతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా దాడులు చేస్తూ, అరకొర బియ్యాన్ని పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారు.
 
 స్టేజ్-1 బియ్యం రవాణా (కందుకూరులోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి 24 స్టాక్ పాయింట్లకు సరఫరా), స్టేజ్-2 రవాణా(24 స్టాక్ పాయింట్ల నుంచి 2,685 చౌక దుకాణాలకు సరఫరా)ను ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో చేజిక్కించుకున్నారు. ఆ క్రమంలోనే అక్రమ రవాణాకు తెరతీశారు. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులు.. బియ్యం రవాణా కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. ఎఫ్‌సీఐ గోదాములు, స్టాక్ పాయింట్లలోనే బియ్యాన్ని కాజేస్తూ.. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11,53,713 కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 1,19,969, తెల్ల కార్డులు 8,55,784, ట్యాప్ కార్డులు 10,759, రచ్చబండ-1, 2 కార్డులు 70,209, రచ్చబండ-3 కార్డులు 96,997 ఉన్నాయి. ఇవి కాకుండా గులాబీ కార్డులు 54,529 ఉన్నాయి.
 
 గులాబీ మినహా తక్కిన రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా 2,685 చౌకదుకాణాల ద్వారా 14,745.756 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి స్టాక్ పాయింట్లకు బియ్యాన్ని తరలించే క్రమంలోనే క్వింటాలుకు సగటున ఐదు కేజీల బియ్యాన్ని దొంగలిస్తున్నారు. స్టాకు పాయింట్లలోనూ ఇదే కథ. క్వింటాలుకు సగటున నాలుగు కిలోల చొప్పున బొక్కేస్తున్నారు. అంటే.. ఎఫ్‌సీఐ గోదాములు, స్టాక్ పాయింట్ల నుంచే నెలకు కనిష్టంగా 1179.66 టన్నుల బియ్యాన్ని రవాణా కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారు.
 డీలర్ల చేతిలో బోగస్ కార్డులు : జిల్లాలో ఇటీవల ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ సర్వేలో 24,431 రేషన్‌కార్డులు బోగస్‌వని తేలింది.
 
 సర్వే పూర్తయితే మరో 25 వేల బోగస్ కార్డులు తేలుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే.. జిల్లాలో దాదాపు 49 వేల బోగస్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీటిలో అధిక శాతం చౌక దుకాణాల డీలర్ల వద్ద ఉన్నాయి. వీటి ద్వారా కొట్టేస్తున్న 980 టన్నుల బియ్యాన్ని డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొంత మంది డీలర్లు పేదలకు ఇచ్చే రేషన్‌లోనూ కోత పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు తెలియకుండానే బియ్యాన్ని స్వాహా చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి శైలజానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు అగ్రహారంలో ఆంజనేయులు (కార్డు నంబర్ : డబ్ల్యుఏపీ 1213012001245) కార్డుపై నలుగురు కుటుంబ సభ్యులున్నారు. ఒక్కో వ్యక్తికి నాలుగు కేజీల చొప్పున 16 కేజీల బియ్యం అందించాలి. అయితే ప్రతి నెలా నాలుగు కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయమై నెల క్రితం ప్రజావాణికి వచ్చి ఆంజనేయులు గోడు వెళ్లబోసుకున్నాడు.
 
 మూడు రోజుల్లోనే పంపిణీ ముగింపు: రేషన్ డీలర్‌లు సరుకులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. మూడు రోజుల్లోనే ముగించేస్తున్నారు. ప్రతి నెలా 15లోపు డీలర్లు సరుకులకు డీడీలు తీయాలి. 20 నుంచి వచ్చే నెల ఒకటో తేదీలోగా డీలర్లకు సరుకులు సరఫరా చేయాలి. అయితే... చాలా మంది డీలర్లు సకాలంలో డీడీలు తీయడం లేదు. సరుకులు కూడా డీలర్లకు ఆలస్యంగా అందుతున్నాయి.
 
 ఫలితంగా పేదలు అవస్థలు పడుతున్నారు. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... రెండు, మూడు రోజులు పంపిణీ చేసి మమ అనిపిస్తున్నారు. ఉదయం పూట పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో కూలీలు అధిక శాతం మంది వాటిని తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి రేపు రండి... ఎల్లుండి రండంటూ చివరకు ఎగనామం పెడుతున్నారు. పేదలకు సరఫరా చేస్తోన్న 14,745 మెట్రిక్ టన్నుల్లో 12 వేల టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ అవుతోన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. అంటే.. అధికారిక లెక్కల ప్రకారమే 2,245 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నాయి.
 
 ఘరానా మోసం : ఎఫ్‌సీఐ గోదాములు, స్టాక్ పాయింట్లు, రేషన్ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని స్మగ్లర్లు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యానికి తవుడును కలిపి మళ్లీ పాలీష్ చేయిస్తున్నారు. సన్న బియ్యంగా మార్చి కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ కేజీ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి ఉరవకొండ, కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర, రామగిరి, హిందూపురం, గోరంట్ల ప్రధాన కేంద్రాలుగా మారాయి.
 
 దీన్ని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రపోతున్నారు. తూతూ మంత్రంగా మాత్రమే దాడులు చేస్తున్నారు. బియ్యం లారీ పట్టుబడితే సరుకును స్వాధీనం చేసుకుని 6ఏ కేసు నమోదు చేస్తున్నారు. రవాణాలో పాలుపంచుకున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. కళ్యాణదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ వారానికి కనీసం రెండు సార్లయినా అధికారులకు దొరికిపోతున్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పూర్తి స్థాయి పోలీసు విచారణ  చేపడితేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.  

 అక్రమ రవాణాపై దృష్టి సారిస్తున్నాం
 రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాం. జిల్లా నుంచే కాకుండా కర్నూలు జిల్లాలోని బనగానపల్లి కేంద్రంగా కూడా ఎక్కువగా అక్రమ రవాణా సాగుతోంది. మన జిల్లాలో తరలిస్తూ పట్టుబడిన వాటిపై లోతుగా విచారణ చేపడుతున్నాం. ఇక ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యంపై ఆ జిల్లాలకు వెళ్లి విచారణ చేయలేని పరిస్థితి ఉంది.
 - శాంతకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి
 

మరిన్ని వార్తలు