పాపం.. పెన్షనర్లు!

10 Jan, 2019 03:23 IST|Sakshi

అదనపు పెన్షన్‌ చెల్లింపులో సర్కారు మోసం

పదో పీఆర్సీ 15 శాతం సిఫారసు 10 శాతమే ఇవ్వాలని ప్రభుత్వ తాజా నిర్ణయం

55 నెలలుగా అదనపు పెన్షన్‌ నష్టపోయిన వైనం

11వ పీఆర్సీ అమలు తరుణంలో సర్కారు జిమ్మిక్కు

సాక్షి, అమరావతి బ్యూరో: పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. గతంలోని తొమ్మిదేళ్ల పాలనలో వారికి కరువు భృతి (డీఆర్‌) ఇవ్వకుండా చంద్రబాబు ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు ‘తాను మారిపోయాను.. పెన్షనర్లను ఇబ్బంది పెట్టను’ అని హమీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు వెంటనే ఆ హామీని మరిచారు. అప్పటి నుంచీ పదో పీఆర్సీ సిఫారసు అమలుచేయకుండా వారిని ఇబ్బందిపెడుతున్నారు. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. 

అదనపు పెన్షన్‌ ఇవ్వకుండా మోసం
70 ఏళ్లు వయస్సు వచ్చిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. 9వ పీఆర్సీలో 75 ఏళ్ల వయస్సున్న పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వాలనే సూచనను అప్పటి ప్రభుత్వం అమలుచేసింది. పదో పీఆర్సీ సిఫారసును చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.  

70 ఏళ్లకు 10 శాతం అదనపు పెన్షన్‌
అదనపు పెన్షన్‌ అర్హత వయస్సు 75 నుంచి 70 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదో పీఆర్సీ సిఫారసును అయినా యథావిధిగా అమలుచేయాలనే నిర్ణయం తీసుకుందా అంటే అదీ లేదు. 70 ఏళ్లకు 15 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేస్తే.. ప్రభుత్వం పెన్షనర్లకు భిక్షం వేసినట్లు 10 శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

55 నెలల అదనపు పెన్షన్‌ కోల్పోయారు
పదో పీఆర్సీ 2013 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2014 జూన్‌ 1 వరకు 11 నెలలపాటు.. నోషనల్‌గా (కేవలం కాగితాలకే పెంపు పరిమితం. వాస్తవంగా ఆర్థిక లబ్ధి లభించదు) పెంచారు. ఆర్థిక లబ్ధి 2014 జూన్‌ 2 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పదో పీఆర్సీ సిఫారసులను యథావిధిగా అమలుచేసి ఉంటే.. 2014 జూన్‌ 2 నుంచి 2019 జనవరి వరకు.. 55 నెలలపాటు పెన్షనర్లు 15 శాతం అదనపు పెన్షన్‌ పొందేవారు. కానీ.. ప్రభుత్వం మోసంచేసి, 70 ఏళ్లకు అదనపు పెన్షన్‌ ఇవ్వకపోవడంవల్ల 55 నెలలపాటు 15 శాతం అదనపు పెన్షన్‌ కోల్పోయారు. ఉదా.. 10 వేల పెన్షన్‌ వస్తున్న వారికి రూ.1,500 అదనంగా వస్తుంది. అంటే.. నెలకు రూ. 1,500 చొప్పున 55 నెలల కాలానికి రూ. 82,500 నష్టపోయారు. పెన్షన్‌ ఎక్కువగా ఉన్న పెన్షనర్లు రూ.లక్షల్లో నష్టపోయారు.

అదనపు పెన్షన్‌ 15 శాతం చేయండి
ప్రభుత్వం ఇప్పటికైనా పదో పీఆర్సీ సిఫారసులు అమలుచేయాలని, 70 ఏళ్లు వచ్చిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ 15 శాతం ఇవ్వాలని పెన్షనర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. పదో పీఆర్సీ గడువు 2018 జూన్‌కు పూర్తయిందని, వెంటనే 11వ పీఆర్సీ నివేదిక తెప్పించుకుని తక్షణం అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

వృద్ధాప్యంలో అదనపు పెన్షన్‌ ఎందుకంటే?
వయస్సు పెరుగుతున్న కొద్దీ పెన్షనర్లకు ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు భారంగా మారతాయి. ఇతరులపై ఆధారపడటం కూడా ఎక్కువవుతుంది. ఫలితంగా రోజువారీ జీవనానికీ అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా డీఆర్‌ (కరువు భృతి) పెరుగుతుంది. కానీ, అదనపు ఖర్చుల నుంచి ఉపశమనం పొందడానికి వీలుగా అదనపు పెన్షన్‌ ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది.


 

మరిన్ని వార్తలు