మరో ‘ఛీ’టింగ్‌ కేసు

17 Sep, 2019 09:19 IST|Sakshi
అనుమానిత అభ్యర్థి దుర్గాప్రసాద్‌ను విచారిస్తున్న ఎస్‌ఈ రమేష్‌ (ఫైల్‌)

షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టు కోసం రూ.2 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు

విద్యుత్‌  ఉద్యోగి గోపీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

పది రోజులైనా ఇంకా పరారీలోనే...

సాక్షి, అరసవల్లి: జూనియర్‌ లైన్‌మన్‌ (జేఎల్‌ఎం) నియామకాల్లో దళారీ అవతారమెత్తిన ఈపీడీసీఎల్‌ సీనియర్‌ అసిస్టెంట్, 1104 విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి ఎం.వి.గోపాలరావు (గోపి) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన అవినీతిపై మరో కేసు నమోదైంది. షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టు ఇప్పిస్తానంటూ 2016లో తన నుంచి అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు తీసుకున్నాడని, ఇప్పటివరకు ఉద్యోగం రాలేదని, ఆఖరికి అడ్వాన్స్‌ డబ్బులు కూడా ఇవ్వడం లేదంటూ బుడితి గ్రామానికి చెందిన కళ్లేపల్లి మల్లేసు అనే యువకుడు టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈపోస్టు కోసం గోపికి, మల్లేసుకు మధ్య రూ.5 లక్షలకు బేరం కుదరగా, ముందుగా రూ.2 లక్షలు ఇచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఈ ఫిర్యాదు చేరడంతో.. టూ టౌన్‌ పోలీసులు గోపాలరావుపై 420 సెక్షన్‌ కింద మరో చీటింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఈనెల 7న ఆమదాలవలసకు చెందిన జి.దుర్గాప్రసాద్‌ అనే అభ్యర్థితో జేఎల్‌ఎం పోస్టు ఇప్పిస్తానని బేరసారాలు సాగిస్తున్నారని గోపీతోపాటు వ్యాపారి శ్రీధర్‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి నేటికి పది రోజులు అవుతున్నా... ఇంతవరకు పోలీసుల చర్యల్లో పురోగతి కన్పించలేదు. యూనియన్‌ నేత గోపితో పాటు శ్రీధర్‌ ఆచూకీని కూడా పోలీసులు కనిపెట్టలేదు. దీంతో దళారీ వ్యవహారం కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండిపోయింది. ఇదిలావుంటే సివిల్‌ పోలీసుల నుంచి ఈ దళారీ వ్యవహారం కేసును సీసీఎస్‌ (క్రైం బ్యాంచ్‌) పోలీసులకు బదిలీ అయ్యింది. అయినప్పటికీ ఇంతవరకు దర్యాప్తు వ్యవహారం తేలలేదు. అభ్యర్థి దుర్గాప్రసాద్‌ ఫోన్‌ డేటా బయటపడితే.. మరింత మంది గ్యాంగ్‌ సభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇదిలావుంటే జిల్లా కేంద్రంతోపాటు నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, రాజాం, ఎచ్చెర్ల, భామిని, పలాస తదితర ప్రాంతాల్లో కూడా దళారీ గ్యాంగ్‌ తమ హవాను కొనసాగించారని తెలు స్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపీపై కేసులు నమోదై.. మిగిలిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశాలుండడంతో వారందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలావుంటే ఈ దళారీ వ్యవహారంపై క్షేత్ర స్థాయి నుంచి దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి... విజిలెన్స్‌ జేఎండీ తదితర ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో ఈ కేసును శాఖాపరంగా సీరియస్‌గా పరిగణిస్తున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.వి.గోపాలరావును విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

1104 సంఘ రీజనల్‌ సెక్రటరీగా రాంప్రసాద్‌:
విద్యుత్‌ లైన్‌మన్‌ పోస్టుల ఎంపికలో దళారీ వ్యవహారం నడిపిస్తున్నట్లు ప్రధాన ఆరోపణలున్న ఎం.వి.గోపాలరావు (గోపి)ని 1104 విద్యుత్‌ ఉద్యోగుల సంఘం నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ 1104 యూనియన్‌ రాష్ట్ర సం ఘ అధ్యక్షుడు వి.ఎస్‌.ఆర్‌.కె.గణపతి కీలక నిర్ణయం ప్రకటించారు. ఈమేరకు సోమవారం విశాఖపట్నంలో  జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రీజనల్‌ సెక్రటరీగా ఉన్న గోపాలరావును తాత్కాలికంగా తప్పించేలా నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ స్థానాల్లో అడహక్‌ కమిటీని నియమించారు. ఈప్రకారం జిల్లాలో 1104 సంఘ రీజనల్‌ అధ్యక్షుడిగా ఎన్‌.లోకేష్, రీజనల్‌ కార్యదర్శిగా ఎ.వి.రాంప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గణపతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 20లోగా రీజనల్‌ సంఘానికి కొత్త సభ్యుల నియామకాలకు ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాలంటూ గణపతి సూచించా రు. అంతవరకు అడ్‌హక్‌ కమిటీ సభ్యులే సంఘ బాధ్యతలు నిర్వర్తించాల్సి వుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి సుమారు 40 మంది వరకు యూనియన్‌ ప్రతినిధులు హాజరయ్యారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు