అమరావతిలో భారీ మోసం​

29 Nov, 2019 15:36 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం అమరావతిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రమేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.12 కోట్లు విలువైన భూమిని బలవంతంగా ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రాజధాని ప్రాంతంలో భూములకు భారీ డిమాండ్‌తో అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అమరావతికి చెందిన చేకూరి వెంకటేశ్వరరావు చౌదరి అనే భూ వ్యాపారి రమేష్‌కు చెందిన 6.33 ఎకరాల పంట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భూమిని వెంటనే తనకు తిరిగి ఇచ్చేయాలని రమేష్‌ డిమాండ్‌ చేయగా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని.. విషయం ఎవరికైనా చెప్తే పిల్లలను చంపేస్తానని వెంకటేశ్వరరావు బెదిరించారని అతను వాపోయాడు.

రమేష్ ఇంటిపక్కనే నివశిస్తూ వెంకటేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డారని, దైవ కార్యక్రమాలతో ఉండే రమేష్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలా మోసం చేశాడని స్థానికులు బెబుతున్నారు. స్థానికుల అండతో రమేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా గత ప్రభుత్వంలో అనేక భూకుంభకోణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. స్థానికులను బెదిరించి పెద్ద మొత్తంలో భూములను స్వాధీనం చేసుకున్న అనేక ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు