నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురి అరెస్ట్‌

13 Dec, 2018 07:13 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పట్టణ డీఎస్పీ సూర్యశ్రావణ్‌ కుమార్‌

పోలీసుల అదుపులో కానిస్టేబుల్‌ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యశ్రావణ్‌ కుమార్‌

విజయనగరం టౌన్‌:  రైల్వేశాఖ కమర్షియల్‌ విభాగంలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో గత నెలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎస్పీ జి. పాలరాజు స్పందించి సంఘటనపై దర్యాప్తు చేయమని డీఎస్పీని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన  పట్టణ డీఎస్పీ సూర్య శ్రావణ్‌కుమార్‌ స్థానిక టూటౌన్‌ సీఐ బీవీజే రాజుకు కేసు నమోదు చేయమన్నారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కానిస్టేబుల్‌తో పాటూ మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి  పట్టణ డీఎస్పీ సూర్యశ్రావణ్‌ కుమార్‌  బుధవారం స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. నిందితులు రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు సైతం సృష్టించి కొంతమంది నిరుద్యోగులను మోసం చేశారు. ఈ క్రమంలో బాధితుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేవారు.

అయితే  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన బాధితుడు గేదెల రాజు అనే నిరుద్యోగి తాను మోసపోయినట్లు తెలుసుకుని నవంబర్‌ పదో తేదీన ఎస్పీ జి. పాలరాజుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు డీఎస్పీ సూర్యశ్రావణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తోనంగి శ్రీనివాసరావు, అతని భార్య, కుమారుడుతో పాటు విశాఖలో కన్సెల్టెన్సీ నిర్వహిస్తున్న కోసూరు సత్తిబాబు, తోనంగి రమేష్‌ కుమార్‌యాదవ్, తదితరులు కేసులో కీలక నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.  దీంతో సత్తిబాబును కొద్దిరోజుల కిందట విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.  పరారీలో ఉన్న  తోనంగి   శ్రీనివాసరావు, రమేష్‌కుమార్‌ యాదవ్‌లను రాజాపులోవ వద్ద  బుధవారం అదుపులోకి తీçసుకున్నారు. సత్తిబాబు నుంచి ఇన్నోవా కారు... మిగతా ఇద్దరి నుంచి బ్యాంక్‌ అకౌంట్స్, బంగారం సీజ్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.  సమావేశంలో టూటౌన్‌ సీఐ బీవీజే.రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు