‘ఆన్‌లైన్‌’ పేరుతో మోసం

17 Nov, 2018 07:08 IST|Sakshi
డబ్బులు వసూలు చేసిన వ్యక్తి

గ్యాస్‌ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున వసూలు

నిందుతుడ్ని పట్టుకున్న  వల్లూరు గ్రామస్తులు

మాకే సంబంధం లేదంటున్న నెల్లిమర్ల గ్యాస్‌ ఏజెన్సీ

విజయనగరం, నెల్లిమర్ల రూరల్‌: నేను నెల్లిమర్ల గ్యాస్‌ ఏజెన్సీ నుంచి వచ్చాను.. మీ ఇంటికి ఇప్పటివరకు గ్యాస్‌ నేరుగా తెచ్చి డెలివరీ చేసేవారు.. వచ్చే నెల నుంచి ఆ విధానం మారుతుంది. మీ పేరిట గ్యాస్‌ ఆన్‌లైన్‌ చేసుకోవాలి. దీనికి ఒక్కో వినియోగదారుడు రూ.50 చెల్లించాలి. చివరి తేదీ కూడా అయిపోతోంది.. ఆన్‌లైన్‌ చేయకపోతే మీ ఇంటికి గ్యాస్‌ మరి రాదు.. అంటూ గ్యాస్‌ వినియోగదారులకు మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు కొత్తపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు.. గ్యాస్‌ ఆన్‌లైన్‌ నమోదు పేరిట మండలంలో వల్లూరు గ్రామంలో గురువారం సాయంత్రం కాసేపు హల్‌చల్‌ చేశాడు. ఈ మాయగాడి మాటలు విన్న పలువురు రూ.50 చొప్పున చెల్లించారు.

అనుమానం వచ్చిన గ్రామస్తులు గ్యాస్‌ ఏజెన్సీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వమని కోరగా చెప్పలేక తడబడ్డాడు. అనంతరం గ్యాస్‌ ఆఫీస్‌కు ఫోన్‌ చేసి వివరాలు కోరగా  తాము ఎవ్వరినీ పంపించలేదని  స్పష్టం చేయడంతో గ్రామస్తులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు గతంలో  నెల్లిమర్ల గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొన్నాళ్ల కిందట తీసేశారు. ఈ అనుభవంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు భోగట్టా. గతంలో గుర్ల, చీపురపల్లి మండలాల్లో కూడా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. నెల్లిమర్ల ఎస్సై నారాయణరావును వివరణ కోరగా వల్లూరు గ్రామంలో గ్యాస్‌ ఏజెన్సీ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని విచారిస్తామని తెలిపారు.

మోసగాళ్లను నమ్మవద్దు....
గ్యాస్‌ ఏజెన్సీ పేరిట తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దు. డెలివరీ బాయ్‌ వచ్చి గ్యాస్‌ ఇచ్చి డబ్బులు వసూలు చేసాడు. వాళ్లు ఎక్కువ డబ్బులు అడిగినా మాకు ఫిర్యాదు చేయండి.
గోవింద్, గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహుకుడు

మరిన్ని వార్తలు