అపరిచిత మెసేజ్‌లతో మోసం

24 Nov, 2014 03:57 IST|Sakshi

రూ.1.84 లక్షలకు టోకరా
పెద్దతిప్పసముద్రం: అపరిచిత మెసేజ్‌లతో పలువురు మోసగాళ్లు యువకులను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ చూసి రూ.1.84 లక్షలు పోగొట్టుకున్న యువకుడి ఉదంతం పీటీఎం మండలంలో వెలుగుచూసింది. పీటీఎంకు చెందిన ఓ యువకుడు ఈ నెల 12న ఇంట్లో కూర్చుని మనోరంజన్ చానల్ పెట్టుకుని చూస్తున్నాడు. అందులో ప్రముఖ క్రికెటర్ ముఖ చిత్రాన్ని చూపుతూ ఇతని పేరును కింద స్లైడ్స్‌లో చూపుతున్న నంబర్‌కు ఫోన్ చేసి సరైన సమాధానం ఇచ్చిన వారికి రూ.12 లక్షల నగదు అందజేస్తామని పేర్కొన్నారు.

సదరు యువకుడు క్రికెటర్ పేరు కోహ్లి అని టీవీలో సూచించిన నంబర్‌కు ఫోన్‌లో సమాధానం ఇచ్చాడు. అదే రోజు రాత్రి 9091327247 నంబర్ నుంచి యువకుడి సెల్‌కు ఇన్‌కమింగ్ కాల్ వచ్చింది. మీరు సరైన సమాధానం చెప్పారు.. మేం నిర్వహిస్తున్న టాటా మోటార్ లిమిటెడ్ టెల్‌కోసిటీ జల్‌షద్‌పూర్ గేట్ డిస్పాచ్ డిపార్ట్‌మెంటు జార్ఖండ్ తరఫున రూ.12.80 లక్షల నగదును గెలుచుకున్నారని తెలిపారు. ముందస్తుగా ట్యాక్స్ రూపంలో మా బ్యాంకు ఖాతా 34287329081కు  రూ.12,800 జమ చేయాలని అపరిచిత వ్యక్తి సూచించాడు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో యువకుడు సొమ్మును బ్యాంకులో జమ చేశాడు.

మళ్లీ ఫోన్ చేసి మీది సేవింగ్‌‌స ఖాతా అని, కరెంటు ఖాతాగా మార్చడానికి రూ.7,500, ఇన్‌కంట్యాక్స్ అంటూ మరో రూ.25 వేలు ఇలా 13 రోజుల వ్యవధిలో మొత్తం రూ.1,84,900 జమ చేయించారు. మళ్లీ ఫోన్ చేసి రూ.17 వేలు కడితే మొత్తం సొమ్మంతా మీ ఖాతాలో జమ చేస్తామని అపరిచిత వ్యక్తులు చెప్పారు. అప్పటికి అనుమానం వచ్చిన ఆ యువకుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. బ్యాంకును సంప్రదించగా ఆ అకౌంట్ నంబర్ ‘రాజేష్ శర్మ, 521/7ఏ, షర్దాపూర్, ఫేజ్ టూ, గోవిందాపూర్, మీరట్ జిల్లా అనే చిరునామా ఉన్నట్లు గుర్తించారు. మూడు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ఇలాంటి ఫోన్ మెసేజ్‌కు ఆకర్షితుడై రూ.62,500 పోగొట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు