సైబర్‌ నేరాలకు బ్లాక్‌చెయిన్‌తో చెక్‌

10 Oct, 2017 01:27 IST|Sakshi
బ్లాక్‌చెయిన్‌ సదస్సును ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు గంటా, చిన రాజప్ప, లోకేశ్‌

విశాఖలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సదస్సు ప్రారంభించిన సీఎం

విశాఖలో నవంబర్‌ 17, 18ల్లో హ్యాకథాన్‌ సదస్సు

ఈ హ్యాకథాన్‌కు బిల్‌గేట్స్‌ హాజరవుతారు

సాక్షి, విశాఖపట్నం: బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి విశాఖ రాజధానిగా నిలుస్తుందని చెప్పారు. రెండు రోజుల పాటు జరగనున్న బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సదస్సును సోమవారం విశాఖలోని నోవాటెల్‌ హోటల్లో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా భూముల రిజిస్ట్రేషన్లు, రవాణా వ్యవస్థలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రాష్ట్రంగా ఏపీ ప్రసిద్ధి చెందుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందన్నారు.

రెండు రోజుల పాటు అగ్రి హ్యాకథాన్‌
విశాఖలో వచ్చే నెల 17, 18 తేదీల్లో అగ్రి హ్యాకథాన్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతుందని, దీనికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ హాజరవుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాధారిత భారతదేశంలో భూసార పరీక్షలు చేసి.. తద్వారా దిగుబడులు పెంచుకునే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారన్నారు. కాగా, విశాఖ నగరంలో అమలు చేయనున్న భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ ప్రాజెక్టుకు పాండురంగాపురం సబ్‌స్టేషన్‌ వద్ద  చంద్రబాబు శంకుస్థాపన చేశారు.  గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న థామ్‌సన్‌ రాయ్‌టర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని చంద్రబాబు ప్రారంభించారు. కాండ్యెంట్‌ సహకారంతో రాష్ట్రంలో 5 వేల ఉద్యోగాల కల్పనకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐసీఐసీఐ, మహీంద్ర ఫైనాన్స్‌ సంస్థలు ఫిన్‌టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

అగ్రి హ్యాకథాన్‌ అంటే..: భూముల సమగ్ర సమాచారం, జీపీఎస్‌ విధానంలో హద్దులు, యాజమాన్య వివరాలు సేకరించి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ద్వారా భద్రపరుస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుంది. డ్రోన్‌ కెమెరాలను వినియోగించి భూ సారాన్ని సేకరిస్తారు. వీటికనుగుణంగా ఏ పంటలు పండించవచ్చో తెలుసుకునే వీలుంటుంది. పైన పేర్కొన్న సమాచారాన్నంతటినీ సేకరించేందుకు బ్లాక్‌చెయిన్‌తో పాటు నూతన సాంకేతికతను వినియోగించి భూ వివరాలను నిక్షిప్తం చేసే ప్రాజెక్టును రూపొందించిన వారితో నిర్వహించే సదస్సును అగ్రి హ్యాకథాన్‌గా పేర్కొంటారు.

ప్రపంచ విత్తన కేంద్రంగా ఏపీ: సీఎం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచ విత్తన కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం నారా చంద్రబాబు అన్నారు. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే విత్తనాలను ఎగుమతి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగెడంచ వద్ద మెగా సీడ్‌ పార్క్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం 650 ఎకరాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో అమెరికాలోని అయోవా యూనివర్సిటీతో కలిసి ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇక్కడ కొత్త విత్తనాల పరిశోధనతో పాటు సీడ్‌ కంపెనీలకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, రైతులకూ భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఆయన కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. మూడో విడతలో మొత్తం రూ.3,600 కోట్లతో ఖాతాదారులకు లబ్ధి కలగనుందని వెల్లడించారు. రుణమాఫీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని సరిగ్గా ఉండి రుణమాఫీ కాకుండా ఉంటే ముందుకు రావాలని సవాల్‌ చేశారు. తానిచ్చిన లక్షన్నర రుణమాఫీ తీసుకుని తననే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు