మీరూ కరెంట్‌ అమ్మొచ్చు!

29 Oct, 2019 04:35 IST|Sakshi

సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెల్‌ ఏర్పాటుతో విద్యుత్‌ కష్టాలకు చెక్‌ 

ఇంటికి సరిపడా ఉపయోగించుకుని మిగిలిన విద్యుత్‌ విక్రయం

యూనిట్‌ రూ.5.58 చొప్పున గ్రిడ్‌కు అమ్ముకునే అవకాశం

ఒక్క కృష్ణా జిల్లాలోనే ఏటా రూ.43 లక్షలు ఆర్జిస్తున్న వినియోగదారులు 

రూ.60 వేలు ఖర్చయ్యే ఈ పథకానికి రూ.50 వేలు రాయితీ 

విజయవాడ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన ఎ.సత్యగంగాధర్‌ ఇంటికి నెలకు రూ.1,200 కరెంటు బిల్లు వచ్చేది. దీంతో ఇటీవల తన ఇంటికి సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్‌ను అమర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన అవసరాలకు వాడుకోగా మిగులు విద్యుత్‌ను డిస్కంకు ఇస్తున్నారు. ఇలా ఆయన నెలకు 100–150 యూనిట్ల మేర విద్యుత్‌ను పవర్‌ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రూ.600 నుంచి రూ.1000 వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.  

సాక్షి, అమరావతి బ్యూరో: ఇన్నాళ్లూ వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించడమే వినియోగదారుడికి తెలుసు. కానీ, కొద్ది రోజులుగా వినియోగదారుడే కరెంట్‌ను విద్యుత్‌ సంస్థలకు విక్రయించే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌), నెడ్‌క్యాప్‌లు ఈ వెసులుబాటు కల్పించాయి. పర్యావరణహిత సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వినియోగదారుల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లను రాయితీపై ఏర్పాటు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ సంస్థలు మూడు మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం 648 మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 631 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 444 గృహాలకు సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చారు. మరో 138 కనెక్షన్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తం 444 కనెక్షన్లలో 147 సూర్యశక్తి పథకం కింద మంజూరయ్యాయి. 

విద్యుత్‌ విక్రయం ఇలా.. 
సోలార్‌ రూఫ్‌ టాప్‌ వినియోగదారులు ఉత్పత్తయిన సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి చెల్లిస్తుంది. యూనిట్ల నమోదుకు వీలుగా నెట్‌ మీటర్లు అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్‌ రూఫ్‌ టాప్‌ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ను విక్రయిస్తున్నారు. యూనిట్‌కు రూ.5.58 చొప్పున పవర్‌ గ్రిడ్‌ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలా ఏడాదికి విద్యుత్‌ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు. 

‘సూర్యశక్తి’ ఇలా..
- రూఫ్‌పై 100 (10  గీ 10) చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.  
మీటర్‌ తమ పేరుపై ఉన్న వారెవరైనా నెడ్‌క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ప్యానెల్స్‌ నిర్వహణకు ప్రత్యేక సంస్థలున్నాయి. సర్వీస్  కోసం తక్కువ ఖర్చుతో సేవలందుతాయి.   
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షం కురిసేటప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యం కాదు. మిగతా సమయాల్లో నిరాటంకంగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.  
ఈ పథకం కింద ఒక కిలోవాట్‌ సామర్థ్యం ఉన్న యూనిట్‌ అమరుస్తారు. 
యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు రూ.60 వేలు ఖర్చవుతుంది. అయితే ఇందులో రూ.50 వేలు రాయితీ ఉంటుంది. వినియోగదారుడు భరించాల్సింది కేవలం రూ.10 వేలు మాత్రమే.
విజయవాడలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానల్స్‌ 

మరిన్ని వార్తలు