ఆకతాయిలకు..చెక్‌

11 Mar, 2018 15:11 IST|Sakshi
షీ టీమ్‌ బోర్డ్‌ను బెలూన్‌లతో ఎగురవేస్తున్న దృశ్యం

స్మార్ట్‌సిటీలో షీ టీమ్స్‌ ఆవిర్భావం

2కే రన్‌ విజేతలకు బహుమతులు

భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్‌లో కాకినాడ స్మార్ట్‌సిటీలో ఈవ్‌టీజింగ్‌ నివారణకు జిల్లా పోలీస్‌ విభాగం షీ టీమ్స్‌ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్‌లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్‌ ర్యాలీని రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు.

జేఎన్‌టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్‌ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్‌ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.

ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్‌టీజింగ్‌ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్‌ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్‌కు ఫోన్‌ ద్వారాగానీ, ‘షీటీమ్‌కేడీఏ’ ఫేస్‌బుక్‌ అడ్రస్‌కు, వాట్సాప్‌ నంబర్‌ 94949 33233కు మెసేజ్‌ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు.

కాకినాడ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్‌ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్‌ కళాశాల కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్‌ షీటీమ్స్‌ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు.

ముందుగా భానుగుడి సెంటర్‌ నుంచి జేఎన్‌టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్‌ సాగింది. ఈ రన్‌లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్‌టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్‌ఓ డాక్టర్‌ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు