ఓటుపై వేటు

14 Aug, 2018 09:00 IST|Sakshi

ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది.

ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో  జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్‌ కుమార్‌ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి.

ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి.

9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు
వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్‌ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు.

జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్‌ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్‌లో బీఎల్‌ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్‌ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.
 
ఆధార్, ఫోన్‌ నంబర్లతో ఓట్ల అనుసంధానం
డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు ఎన్నికల కమిషన్‌ ప్రతి ఓటును ఆధార్, ఫోన్‌ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్‌ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్‌ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్‌ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్‌ నంబర్లు ఉంటాయి. అడ్రస్‌లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్‌ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్‌ మారితే.. ఓట్లు అడ్రస్‌ లేకుండా తొలగిస్తున్నారు. 

టార్గెట్‌ వైఎస్సార్‌ సీపీ

కక్ష కట్టి తొలగిస్తున్నారు
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే 

జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు

రాజకీయాలు సరికాదు
ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి.  మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే  

ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం 
గ్రామాల్లో లేని వారు, డబుల్‌ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్‌ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్‌ఓ 

మరిన్ని వార్తలు