గ్రామాల్లో మురుగుకి చెక్‌

5 Nov, 2019 05:14 IST|Sakshi
బందరు మండలంలో పెదయాదల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ ప్రవహిస్తున్న మురుగునీరు

లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద వెచ్చించనున్న మొత్తం (రూ. కోట్లలో) 1,897.50

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నుంచి రూ. 577.50 కోట్లు

మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద రూ.1,320 కోట్లు

నియోజకవర్గానికి రూ. 11.50 కోట్లు 

పంచాయతీల్లో ఓపెన్‌ డ్రెయిన్స్‌ నిర్మాణం  

సాక్షి, మచిలీపట్నం:  గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని పంచాయతీల్లో ఓపెన్‌ డ్రెయిన్స్‌ నిర్మించాలని సంకల్పించింది. రాష్ట్రంలో ఐదువేల జనాభాకు పైబడిన పంచాయతీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించాలని గత ప్రభుత్వం హంగామా చేసింది. నిరంతరం మురుగు నీరు పారే పరిస్థితి లేనప్పుడు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించడం వలన ప్రయోజనం ఉండదని అప్పట్లో ఉన్నతాధికారులు మొత్తుకున్నా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున అంచనాలు వేసి పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓపెన్‌ డ్రైనేజీ వ్యవస్థ మేలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది.

అన్ని గ్రామాల్లోనూ అమలు...
అన్ని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.1,897.50 కోట్లతో లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌డబ్ల్యూఎం) ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టులో 30 శాతం స్వచ్ఛాంధ్ర మిషన్, 70 శాతం ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ మేరకు రూ.577.50 కోట్లు స్వచ్ఛాంధ్ర మిషన్‌ నుంచి, మిగిలిన రూ. 1,320 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నుంచి ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.11.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారుల్లో ఒక వైపు, మెయిన్‌ రోడ్లలో ఇరువైపులా నిర్మించనున్నారు. తొలుత నియోజకవర్గానికో గ్రామ పంచాయతీని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పంచాయతీల్లో అమలు చేస్తారు. స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇళ్ల వద్ద సోక్‌ పిట్స్‌ నిర్మిస్తారు. అలాగే సోక్‌ పిట్‌ లేదా డ్రైన్‌లకు అనుసంధానిస్తూ బట్టలు, వంట సామాగ్రి శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్లాట్‌ ఫామ్స్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇళ్లల్లో వినియోగించే నీటిలో 80 శాతం డ్రైన్స్‌ ద్వారా వెళ్లే విధంగా డిజైన్‌ చేయనున్నారు. 

శాచ్యురేషన్‌ పద్ధతిలో ఓపెన్‌ డ్రైన్స్‌
రాష్ట్రాన్ని నూరు శాతం మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని గ్రామాల్లో సంతృప్త స్థాయిలో ఓపెన్‌ డ్రైన్స్‌ నిర్మించేందుకు లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టాం. ఇందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశాం.
–సంపత్‌కుమార్, ఎండీ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్‌

మరిన్ని వార్తలు