టీడీఆర్‌ అక్రమాలు చెల్లవిక

29 Jun, 2020 11:34 IST|Sakshi

పోర్టల్‌లో నమోదు ప్రక్రియ పూర్తి 

ఇకపై ప్రతి బాండ్‌ స్టాటస్‌ ఆన్‌లైన్‌లో...

2,621 బాండ్లని అప్‌లోడ్‌ చేసిన కార్పొరేషన్‌

సాక్షి, విశాఖపట్నం: నగరపాలక, పురపాలక సంఘాల్లో అభివృద్ధికి వీలున్న భూ బదలాయింపు హక్కు(టీడీఆర్‌) పత్రాల వినియోగంలో అక్రమాలకు చెక్‌ పడనుంది. ఇన్నాళ్లూ మాన్యువల్‌ రికార్డుల్లో ఉన్న టీడీఆర్‌లను ఇకపై ఆన్‌లైన్‌లోనే జారీ, వినియోగం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు జారీ చేసిన పత్రాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇక టీడీఆర్‌ వినియోగంలో అవకతవకలకు చెల్లుచీటీ తప్పదని పట్టణ ప్రణాళికా విభాగం స్పష్టం చేస్తోంది.

పట్టణాలు, నగరాల్లో రహదారుల విస్తరణ సందర్భంగా ఇళ్లు, దుకాణాలు, ఖాళీ స్థలాల్ని కోల్పోయిన వారికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీడీఆర్‌ పత్రాలు జారీ చేస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో 2007 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్రాల ద్వారా అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో అదనపు అంతస్తులు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో గతంలో టీడీఆర్‌ల వినియోగం విషయంలో అక్రమాలు జరిగాయి. ఒకచోట ఇచ్చిన టీడీఆర్‌ పత్రాన్ని ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఒకే టీడీఆర్‌ని పలు చోట్ల విక్రయించేవారు. ఇటీవల పలుచోట్ల ఈ తరహా అక్రమాలు గుర్తించిన ప్రభుత్వం.. ఇకపై టీడీఆర్‌ల విక్రయం పారదర్శకంగా జరిగేందుకు చర్యలకు ఉపక్రమించింది. టీడీఆర్‌ పత్రాలన్నీ ఆన్‌లైన్‌ చేసి ప్రత్యేక పోర్టల్‌ నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలకు పూర్తిగా తెరపడుతుందని భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ దిశగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.

టీడీఆర్‌ అంటే..?
ప్రజా ప్రయోజనం కోసం భూ సేకరణ జరిపితే పరిహారం చెల్లిస్తారు. స్థానిక సంస్థలు తాము చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పరిహారం చెల్లించే స్థోమత స్థానిక సంస్థలకు ఉండదు. దీంతో వీటికి భూ బదలాయింపు అభివృద్ధి హక్కు (టీడీఆర్‌) బాండ్లు జారీ చేస్తారు. దీని ప్రకారం ఉదాహరణకు రహదారి విస్తరణలో వందగజాలు కోల్పోయిన బాధితుడికి టీడీఆర్‌ కింద 400 గజాలు విలువైన పత్రాలు జారీ చేస్తారు. బాండ్లని బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థలం విలువ పెరిగితే బాండ్ల విలువ పెరుగుతుంది. ఇలాంటి బాండ్లని అదే సంస్థలో రుసుములకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రహదారుల విస్తరణకు భూసేకరణ జరుపుతుంటారు. జీవీఎంసీ పరిధిలో జరిగిన రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన వారికి కార్పొరేషన్‌ బాండ్లు మంజూరు చేసింది.

అన్నీ.. ఆన్‌లైన్‌లోనే..
జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకూ ఎవరెవరి పేరుతో ఎన్ని టీడీఆర్‌ పత్రాలు జారీ చేశారు.. వీటిలో ఎంత మేర ఉపయోగించుకున్నారు.. ఇంకా ఎన్ని బాండ్లు మిగిలి ఉన్నాయి.. పూర్తిగా వినియోగించుకున్న వారి వివరాలు.. ఇలా.. అన్నీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పూర్తి చేశారు. గ్రేటర్‌ పరిధిలో జారీచేసిన టీడీఆర్‌ రికార్డులన్నీ పరిశీలించి.. రోజుకు 200 చొప్పున అప్‌లోడ్‌ చేసి ప్రక్రియ పూర్తి చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇకపై టీడీఆర్‌లకు సంబంధించిన అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లో పక్కాగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ పోర్టల్‌ని ఏపీడీపీఎంఎస్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. ఇకపై ప్రతి టీడీఆర్‌ కూడా ఆన్‌లైన్‌లో కమిషనర్‌ డిజిటల్‌ సిగ్నేచర్‌ చేస్తారు. కొనుగోలు చేస్తున్న వారు కూడా.. వాటి విలువ, అవి నిజమైనవా.. కాదా... అనేవి నిర్థారించుకోవచ్చు.

అక్రమాలు చోటు చేసుకోకుండా...
టీడీఆర్‌లు కొనుగోలు చేసే సమయంలో గతంలో సరైన ప్రక్రియ లేకపోవడం వల్ల కొనుగోలుదారులు మోసపోయేవారు. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా.. పక్కాగా ఆన్‌లైన్‌లో రికార్డుల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశాం. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు నిర్దేశించిన గడువులోగా వాలిడేషన్‌ని పూర్తయింది. టీడీఆర్‌ ఒరిజినల్‌ కాదా అవునా ? అనేది స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
– ఆర్‌జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ 

మరిన్ని వార్తలు