ఎన్నికల చెక్‌పోస్టులున్నా ఆగని స్మగ్లింగ్

9 May, 2014 02:51 IST|Sakshi
ఎన్నికల చెక్‌పోస్టులున్నా ఆగని స్మగ్లింగ్
  •     పోలీసుల కన్నుగప్పి సాగుతున్న అక్రమ రవాణా
  •      పౌడరు రూపంలోనూ తరలుతున్న ఎర్రచందనం
  •  సాక్షి, చిత్తూరు: ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా జిల్లాలో పోలీసు చెక్‌పోస్టులు విస్తృతంగా ఏర్పాటు చేసినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు అడ్డుకోలేకపోయారు. చిత్తూరు ఈస్టు ఫారెస్టు డివిజన్, తిరుపతి వైల్డ్‌లైఫ్ ఫారెస్టు డివిజన్ పరిధుల్లో ఫిబ్రవరి నుంచి పోలీసులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యూరు. దీన్ని అవకాశంగా తీసుకున్న స్మగ్లర్లు ప్రధాన రహదారులపై ఉన్న పోలీసు చెక్‌పోస్టులను వదిలేసి గ్రామాల మీదు గా చెన్నై, తమిళనాడు, కర్ణాటకవైపు వెళ్లే విధంగా వ్యూహం మార్చుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ సాగిస్తున్నారు.

    ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా తిరుపతి అటవీప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు పూతలపట్టు మండలంలోని రంగంపేట వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటలకు పట్టుబడ్డాయి. ద్విచక్రవాహనదారుడిని ఢీకొని పారిపోతున్న ఐచర్ వాహనాన్ని సుమో డ్రైవర్ గమనించి వెంటపడడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యూరు.

    తిరుచానూరులో గురువారం తెల్లవారుజామున ఐచర్ వాహనంలో 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న డ్రైవర్‌కు పోలీసు వాహనం కంటపడింది. వారినుంచి తప్పించుకునేందుకు ఆలయం వైపు వెళ్లాడు. చలువపందిళ్లను ఢీకొని వాహనం ఆగిపోయింది. డ్రైవర్ పరారయ్యాడు. పనపాకం ఫారెస్టు బీట్‌పరిధిలో కూడా వారం క్రితం ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు నిరంతరాయంగా  తరలించేస్తున్న ఎర్రచందనం దుంగలు విలువ కోట్లలో ఉంటుంది.
     
    రూపుమార్చి తరలింపు
     
    నిన్నమొన్నటి వరకు బెరడుతీసిన పెద్దపెద్ద ఎర్రచందనం దుంగలను వివిధ రకాల వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తరహా స్మగ్లింగ్‌పై అధికారులు నిఘాపెట్టడం, దాడులు ఎక్కువచేస్తుండడంతో స్మగ్లర్లు స్మగ్లింగ్‌కు వీలుగా రహస్యప్రదేశాల్లోనే చిన్న, చిన్న దుంగలుగా కత్తిరించి లారీల కింద భాగంలో అమర్చి రవాణా చేయడం కూడా ప్రారంభించారు.

    ఇటీవల హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లర్ ఎర్రచందనం పౌడరును బాక్స్‌ల్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా పట్టుకుని అరెస్టు చేశారు. దీన్నిబట్టి చూస్తే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు దుంగల రూపంలోనే కాకుండా ఎర్రచందనాన్ని విదేశాలకు పౌడరు రూపంలో కూడా ఎగుమతి చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
     
    సాయుధ దళాల తగ్గింపు
     
    ఎన్నికల విధులు ఉండటంతో రెండు నెలలుగా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను వేటాడేందుకు వేళ్లే సాయుధ పోలీసుదళాల సంఖ్యను తగ్గించారు. అటవీశాఖాధికారులు కూడా కొంత మేర శివారు ప్రాంతాల్లో నిఘా వేయటం మినహా, దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లటం మానుకున్నారు. దీంతో  తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు గ్రామాల మీదుగా యథేచ్ఛగా ఎర్రచందనం నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు