సైబర్ నేరాలకు చెక్

11 Apr, 2016 01:04 IST|Sakshi

విజయవాడలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ
ఇప్పటికే పనిచేస్తున్న సైబర్ సెల్

 

విజయవాడ : రాజధాని నగరంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్ని మోసం చేయడంతో మొదలవుతున్న సైబర్ నేరాలు ఫేస్‌బుక్ ఖాతాల వరకు విస్తరించాయి. నగరంలో వారానికి సగటున రెండు సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో నగరంలో  కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకానుంది. కమిషనరేట్‌ను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దీన్ని మంజూరు చేశారు. ఇప్పటికే కమిషనరేట్‌లోని సైబర్ సెల్ సైబర్ క్రైం కేసుల్ని పర్యవేక్షిస్తోంది. సైబర్ క్రైం స్టేషన్ మంజూరుతోపాటు అదనంగా కొంతమంది సిబ్బందిని కూడా కేటాయించారు.

 
మరింత పటిష్ఠంగా కమిషనరేట్

విజయవాడలో   కెడ్రిట్ కార్డుల మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. రాజధాని నగరం కూడా కావడంతో ముందుగానే పోలీస్ కమిషనరేట్‌ను రేంజ్ డీఐజీ క్యాడర్ నుంచి అడిషనల్ డీజీ క్యాడర్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఇది జరిగిన రెండేళ్లకు అప్‌గ్రేడ్‌కు అనుగుణంగా వసతులు, సౌకర్యాలు, ఐపీఎస్‌ల సంఖ్య, పోలీస్ సిబ్బంది సంఖ్య పెంచారు. ఈ క్రమంలో కమిషనరేట్ బలోపేతానికి ఐపీఎస్ అధికారులతో కలిపి 471 మంది పోలీసుల్ని కొత్తగా కేటాయించి కొత్తగా కొన్ని ప్రత్యేక వింగ్‌లు ఏర్పాటు చేసుకోవటానికి వీలుగా ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చింది. నగరంలో కమిషనర్ పోస్ట్‌తో పాటు అదనపు కమిషనర్ పోస్టులో ఐజీ క్యాడర్ అధికారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోస్టులో డీఐజీ క్యాడర్ అధికారిని నియమించనున్నారు. వీరిలో అదనపు కమిషనర్ పోస్టు ఇప్పటికే భర్తీ కాగా మిగిలిన పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. మరోవైపు దీంతోపాటు కొత్తగా కొన్ని జోన్లు, సబ్ డివిజన్లు, సర్కిళ్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో  సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు కీలకం కానుంది.

 
30 మంది నైపుణ్యతగల పోలీసులతో...

కమిషనరేట్‌లో ఐటీ పరిజ్ఞానం ఉన్న సుమారు 30 మంది పోలీసులతో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఆవిర్భవించనుంది. ఏటా నగరంలో సగటున 100 వరకు సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువగా బ్యాంకుల్ని మోసగించిన కేసులు, క్రెడిట్ కార్డు మోసాలు, నకిలీ ఏటీఎం కార్డులతో బురిడీ కొట్టించడం, యూరో లాటరీ మోసాలు, బ్యాంక్ అకౌంట్లలోని లావాదేవీల సమాచారం హైక్ చేయడం, వివిధ కీలక కంపెనీల డేటాను హైక్ చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లతో యువతుల్ని వేధించడం, ప్రేమ పేరుతో వలవేయడం లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేరాలన్నింటిని ప్రస్తుతం కమిషనరేట్‌లో ఉన్న సైబర్ సెల్ పర్యవేక్షిస్తుంది. స్టేషన్లలో నమోదైన కేసుల్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్ని మాత్రమే ఈ టీమ్ పర్యవేక్షిస్తుంది. ప్రత్యేకంగా సైబర్ క్రైం స్టేషన్ ఏర్పాటు ద్వారా నగరంలో ఎక్కడ సైబర్ నేరం జరిగినా ఇక్కడి స్టేషన్‌లోనే కేసు నమోదు చేసి దర్యాపు చేయనున్నారు. దీనిని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఒక సీఐతో పాటు ఇద్దరు ఎస్‌లతో కలిపి 30 మంది వరకు సిబ్బందిని డెప్యుటేషన్‌పై కేటాయించనున్నారు. ఇప్పటికే సైబర్ సెల్ పోలీసులకు నైపుణ్యత పెంపు కోసం రెండు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేసుల్ని పర్యవేక్షించనున్నారు. దీని కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు