ట్రాఫిక్ చిక్కులకు చెక్

12 Jun, 2015 02:04 IST|Sakshi

 80 వేల ఇళ్లు.. సుమారు 5.20 లక్షల జనాభా... 14 వేల ఆటోలు, అంటే ప్రతి 37 మందికి ఒక ఆటో... ప్రతి ఇంటికీ ఒక ద్విచక్రవాహనం... కార్లు అదనం. వీటికి తోడు ఆర్టీసీ బస్సులు, ప్రైైవేటు వాహనాలు... ఏ చిన్న సందు చూసినా రద్దీ. ప్రధానరోడ్లపై  వాహనాలు అడ్డంగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటుంటారు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటపడాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఇదీ అనంతపురం నగర ట్రాఫిక్ దుస్థితి.
 
 అనంతపురం క్రైం : రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అంతేస్థాయిలో వివిధ రకాల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలో రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఉన్న రోడ్లను తోపుడుబండ్లు, ఆటోలు ఆక్రమించేయడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీన్ని పరిశీలించిన జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు మెన్‌పవర్ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ఏడుగురు ఎస్‌ఐలు, 9 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు.

 కూడళ్లలో ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు
 ప్రస్తుతం నగరంలోని ప్రతి కూడలిలో కనీసం ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఉన్న సిగ్నల్ లైట్లు ఒక రోజు పని చేస్తే వారం రోజులు పనిచేయని స్థితిలో ఉన్నాయి. దీంతో ఆటోమేటిక్ సిగ్నల్‌లైట్లు ఏర్పాటుకు పూనుకున్నారు.  నడిమివంక, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, సూర్యానగర్ సర్కిల్, తాడిపత్రి బస్టాండ్ వద్ద ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్ లైట్లలో టైమ్స్, సిగ్నల్స్‌తోపాటు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. దీంతో సిబ్బంది ఉన్నా, లేకపోయినా సిగ్నల్స్ మేరకు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అతిక్రమించినా సీసీ కెమెరాల్లో నమోదవుతాయి. పుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాటి ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు.

 మొబైల్ పార్టీల గస్తీ
 ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. మొత్తం 12 మొబైల్ పార్టీలు ఉన్నాయి. ఉదయం ఆరు , మధ్యాహ్నం ఆరు మొబైల్ పార్టీలు పని చేస్తాయి. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మొబైల్ పార్టీలు గస్తీ తిరుగుతూ ట్రాఫిక్‌కు చర్యలు తీసుకుంటుంటారు.

>
మరిన్ని వార్తలు