చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు

13 Mar, 2019 08:12 IST|Sakshi
మాట్లాడుతున్న డీసీ రాధయ్య

ఎన్నికలకు మద్యం సరఫరా చేస్తే దుకాణాలపై కేసులు 

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు   

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.రాధయ్య తెలిపారు. మంగళవారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిబంధనల మేరకే మద్యం విక్రయాలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయనేతలకు మద్యం సరఫరా చేసి నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 300 మందిని బైండోవర్‌ చేసుకున్నామన్నారు. ఎన్నికల నోడల్‌ అధికారిగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమ శాఖ జాయింట్‌ కమిషనర్‌ జోసఫ్‌ను ఉన్నతాధికారులు నియమించారన్నారు. 


అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదు
ఎన్నికల్లో మద్యం ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది మార్చిలో ఎంత మద్యం దుకాణాలకు సరఫరైందో దానికన్నా తక్కువగా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత మార్చిలో రూ.108 కోట్లు విలువచేసే  2,03,512 మద్యం కేసులు, 1,35,3920 బీరు కేసులు దేవరపాళెం, ఓజిలిలోని ఐఎంఎల్‌ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అయిందన్నారు. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి 11వ తేదీ వరకు రూ.54.23 కోట్లు విలువచేసే 94,553 మద్యం కేసులు, 62,215 బీరు కేసుల సరఫరా జరిగిందన్నారు. నిర్ణీత స్టాక్‌ కంటే ఒక్క కేసు అదనంగా ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. 


ప్రతిరోజూ తనిఖీలు 
మద్యం దుకాణాలు, బార్లలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత విక్రయాలు జరిగాయి?, ఒకవేళ విక్రయాలు పెరిగితే అందుకు గల కారణాలు? స్టాక్‌ రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహిస్తున్నారా? నిర్ణీత వేళల్లో దుకాణాలు నడుస్తున్నాయా? బెల్టుషాపులు ఉన్నాయా? రాజకీయ నేతలకు మద్యం సరఫరా చేస్తున్నారా? తదితర వివరాలను సేకరిస్తామన్నారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో ఈ ప్రక్రియ ఎన్నికలు ముగిసేంతవరకూ కొనసాగుతుందన్నారు. నిబంధనల ఉల్లంఘునలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 


24 గంటలూ..
ఎన్నికల వేళ తమిళనాడు, కర్నాటక, పాండిచేరి, గోవాల నుంచి మద్యం సరఫరా అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా వాటి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే తడ బీవీపాళెం వద్ద శాశ్వత చెక్‌పోస్టు ఉందన్నారు. దీంతోపాటు ఎన్నికల దృష్ట్యా రాపూరు పరిధిలోని పంగిలి వద్ద, ఉదయగిరి – బద్వేల్‌ రోడ్డులోని వై జంక్షన్‌ వద్ద, నాయుడుపేట శివార్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిచోట ఒక సీఐతోపాటు కొందరు సిబ్బంది ఉంటారని, వీరు 24 గంటలపాటు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తారన్నారు. నాన్‌డ్యూటీపెయిడ్‌ లిక్కర్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 


రెండు ఇంటిలిజెన్స్‌ బృందాలు 
నెల్లూరు, గూడూరు ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో రెండు ఇంటిలిజెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక సీఐతో పాటు ఆరుగురు సభ్యులు ఈ బృందాల్లో ఉంటారన్నారు. మద్యం నియంత్రణ, పంపిణీ, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి, సారా తయారీ, పంపిణీ తదితరాలపై బృందాలు నిఘా ఉంచి వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.శ్రీరామచంద్రమూర్తి, నెల్లూరు, గూడూరు ఎక్సై జ్‌ సూపరింటెండెంట్లు శ్రీనివాసాచారి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు 
మద్యం అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలను అడ్డుకునేందుకు నెల్లూరు డీసీ కార్యాలయం (0861–2331159)లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు సిబ్బంది 24 గంటలపాటు విధులు నిర్వహిస్తారన్నారు.  ఎక్కడైనా అక్రమ నిల్వలున్నా, మద్యం అక్రమ రవాణా, పంపిణీ జరుగుతున్నా ప్రజలు ఫోన్‌ చేసి సమాచారమందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఆ మద్యం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకుని సరఫరా చేసిన దుకాణదారుని లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు