తనిఖీలు తప్పనిసరి

7 Oct, 2017 12:29 IST|Sakshi

ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టులో సరుకుల ఎగుమతి–దిగుమతులకు లంగరు వేసే ప్రతి విదేశీ నౌకలోని సిబ్బంది ఆరోగ్య స్థితిగతులు తనిఖీ చేయాల్సిందే. నౌకల్లోని సిబ్బంది ద్వారా విదేశాల నుంచి వ్యాధులు మన దేశంలోకి ప్రవేశించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేసే డాక్టర్‌ అమరేంద్రనాథరెడ్డి ‘హెల్త్‌ ఆఫీసర్‌’ హోదాలో గత డిసెంబరు నుంచి ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోర్టుకు వచ్చే ప్రతి విదేశీ నౌక సిబ్బంది హెల్త్‌ కార్డులను తనిఖీ చేస్తున్నారు.

 ముఖ్యంగా సిబ్బందిలో ‘ఎల్లో ఫీవర్‌’ లక్షణాలు గుర్తించడమే ఆయన విధుల్లో ముఖ్యమైన అంశం. ప్రతి నౌకలో 19 నుంచి 21 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్త్‌ కార్డ్‌ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థగుర్తించిన వైద్య సంస్థలు అన్ని రకాలుగా పరీక్షించి, విదేశాలకు బయలుదేరే నౌక సిబ్బందికి హెల్త్‌ కార్డులిస్తుంది. ప్రతి ఒక్కరి హెల్త్‌ కార్డులో ఎల్లో ఫీవర్‌ లక్షణాలు లేవనే అంశాన్ని తనిఖీ చేయడమే హెల్త్‌ ఆఫీసర్‌ బాధ్యత. సిబ్బంది హెల్త్‌ కార్డులన్నీ క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆయన క్లీన్‌ చిట్‌ ఇవ్వాలి. పోర్టులో విదేశీ నౌక లంగరు వేసినప్పుడల్లా హెల్త్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగాలి.

ప్రతి నెలా 35 నౌకల తనిఖీ
కృష్ణపట్నంపోర్టులో లంగరు వేసే ప్రతి విదేశీ నౌకా సిబ్బంది హెల్త్‌ కార్డులు తనిఖీ చేస్తాం. ప్రతి నెలా 30 నుంచి 35 విదేశీ నౌకలు తనిఖీ చేస్తుంటాం. ముఖ్యంగా ఎల్లో ఫీవర్‌ లక్షణాలపై శ్రద్ధ వహిస్తాం. ఇప్పటి వరకు నౌకల్లో ఈ లక్షణాలున్న వ్యక్తులు తారసపడలేదు. స్వదేశీ నౌకల్లో సిబ్బందిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదు.
–డాక్టర్‌ అమరేంద్రనాథరెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు