‘చెడ్డీ’.. అలర్ట్‌!

15 Oct, 2018 10:16 IST|Sakshi

మొన్న ఏలూరు.. నిన్న కర్నూలులో..

తాజాగా విశాఖపట్నంలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

అర్ధరాత్రి తలుపుతడితే తీయొద్దంటున్న పోలీసులు

బెజవాడ కమిషనరేట్‌ పరిధిలో అప్రమత్తం

‘చెడ్డీ’ గ్యాంగ్‌.. ఏడాది కాలంగా రాష్ట్ర పోలీసులకు సవాలుగా మారింది. ఈ గ్యాంగ్‌ ఎప్పుడు ఏ నగరంపై పడి దోచుకుంటుందోనన్న ఆందోళన ప్రస్తుతం అందరిలోనూ కనిపిస్తోంది. మొన్న ఏలూరులో హల్‌చల్‌ చేసిన ఈ గ్యాంగ్‌.. ఆ తర్వాత కర్నూలు.. తిరుపతి నగరాల్లో అలజడి సృష్టించింది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన వరుస చోరీల్లో చెడ్డీ గ్యాంగ్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడపై ఈ గ్యాంగ్‌ కన్నేసినట్లుగా నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. 

సాక్షి, అమరావతిబ్యూరో : శివారు ప్రాంతాలను మాత్రమే ఎక్కువగా టార్గెట్‌ చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ విజయవాడపై కన్నేసిందా..? అంటే అవుననే చెబుతున్నాయి రాష్ట్ర నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలో నగరంలోకి కొత్తగా ప్రవేశించే వారిపైనా.. శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని సంచార జాతుల్లా జీవించే వారిపై పోలీసు శాఖ పటిష్ట నిఘా పెట్టింది. కాగా.. అర్ధరాత్రి వేళ ఎవరైనా అనుమానితులు తలుపుతడితే తియ్యోద్దంటూ పోలీసు సూచిస్తున్నారు. 

ఇదీ ‘చెడ్డీ’ గ్యాంగ్‌ చరిత్ర.. 
తమ చోరీల కోసం చెడ్డీ గ్యాంగ్‌ ముందుగా ఓ నగరాన్ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత ముఠా సభ్యులంతా అక్కడికి చేరుకుంటారు. స్థానిక రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో మకాం వేస్తారు. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లో.. రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని సంచారజాతుల్లా జీవిస్తారు. పగలంతా రెక్కీ చేయడం రాత్రివేళల్లో దొంగతనాలు చేయడం వీరి తీరు. అంతేకాక పగటిపూట చిన్న చిన్న వ్యాపారులుగా.. రోడ్లపై బెలూన్లు అమ్ముకుంటుంటారు. కొంతమంది బిచ్చగాళ్లు గాను సంచరిస్తారు. ఆ క్రమంలోనే చోరీకి అనువైన ఇంటిని గుర్తిస్తారు. ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలకు ఎంచుకుంటారు. ఆ ఇంటి బాల్కనీలో ఆరేసిన బట్టల ఆధారంగా ఖరీదైన ఇళ్లుగా అంచనా వేస్తారు. దాదాపుగా ముఠాలోని మహిళా సభ్యులే ఈ పనులు చేస్తుంటారని సమాచారం. ఆ సమాచారాన్ని ముఠాలోని పురుషులకు చెబితే.. రాత్రి వేళ చోరీకి రంగం సిద్ధం చేసుకుంటారు. 

నడుముకు చెప్పులు కట్టుకుని..
చోరీ సమయంలో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు, ఎక్కడా అలికిడి వినిపించకుండా ఉండేందుకు ఈ గ్యాంగ్‌ చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది. ఒంటికి నూనె లేదా గ్రీజు రాసుకునే చోరీలకు వెళ్తారు. చోరీకి వెళ్లేటప్పుడు అడుగుల శబ్ధం వినిపించకుండా ఉండేందుకు చెప్పుల్ని నడుముకు కూడా కట్టుకుంటారు. చోరీ కోసం ఇనుప వస్తువులు, రాడ్లు, గొడ్డళ్లు వంటి వాటినే ఎక్కువగా వెంట తీసుకెళ్తారు. కొన్నిసార్లు నాటు తుపాకులు కూడా తీసుకెళ్తారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డుపడితే లుంగీలు, తాళ్లతోనే కట్టేస్తుంటారు. అవసరమైతే హత్యలకూ వెనుకాడరు.  

మకాం షిఫ్ట్‌..
వరుస చోరీల తర్వాత ఆ ప్రాంతంలో నిఘా పెరిగిందని భావిస్తే.. వెంటనే తట్టా బుట్టా సర్దుకుని మరో నగరానికి వెళ్లిపోతారు చెడ్డీ గ్యాంగ్‌. దేవాలయాల్లోను వీరు చేతివాటం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ తదిరత రాష్ట్రాల్లో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం కమిషనరేట్‌ పోలీసులు నగరంలో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

అనుమానితులపై నిఘా..
అనుమానితులపై నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నేరస్తులు ఎవరైనా ఎలాంటి నేరాలకు పాల్పడ్డా.. తక్షణమే గుర్తించి నేరాలను నివారించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సంచార జాతులుగా వలస వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెడతామని పేర్కొన్నారు. వారి రోజు వారి కార్యకలాపాలపై దృష్టి ఉంచి అనుమానాస్పదంగా ఉంటే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు