చీమకుర్తికి కరోనా సెగ!

6 Feb, 2020 13:17 IST|Sakshi
రామతీర్థంలోని ఓ గ్రానైట్‌ క్వారీ

గ్రానైట్‌ కొనుగోలు కోసం చైనా నుంచి జిల్లాకు నెలకు 200 మందికిపైగా బయ్యర్లు

వారం నుంచి నెల రోజులకుపైగా మెటీరియల్‌ కొనుగోలు చేసే వరకు చీమకుర్తి, ఒంగోలు లాడ్జీల్లో బస

చైనాలో కరోనా విజృంభనతో చీమకుర్తి, ఒంగోలు వాసుల్లో ఆందోళన

ప్రకాశం, చీమకుర్తి: చైనాలో కరోనా విజృంభిస్తుంటే చీమకుర్తి వాసులు ఆందోళన చెందుతున్నారు. నెలకు 200 మందికి పైగా చైనా గ్రానైట్‌ బయ్యర్లు చీమకుర్తి రావడమే ఇందుకు కారణం. చీమకుర్తి, రామతీర్థం పరిధిలో ఉన్న గెలాక్సీ గ్రానైట్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చీమకుర్తిలో దాదాపు 80కి పైగా గ్రానైట్‌క్వారీలు, దాదాపు 300కు పైగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముడి రాయి కొనుగోలు చేయడానికి వచ్చిన చైనా బయ్యర్లతోపాటు మధ్యవర్తులు కూడా గ్రానైట్‌ ఫ్యాక్టరీలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. 80 శాతానికి పైగా గెలాక్సీ గ్రానైట్‌ను చైనా వ్యాపారులే గత పదేళ్ల నుంచి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్న వార్తలను ప్రసార సాధనాల్లో చూస్తూ చీమకుర్తి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. చైనా బయ్యర్లతో చీమకుర్తి, ఒంగోలుతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 150 మందికి పైగా స్థానిక మధ్యవర్తులకు సంబంధాలున్నాయి.

క్వారీ యజమానులతో మధ్యవర్తులే వ్యాపార సంబంధాలు కలుపుతుంటారు. ఈ నేపథ్యంలో చైనా వాసుల నుంచి గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చైనా నుంచి వచ్చే వ్యక్తులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్కానింగ్‌ చేస్తున్నా, అనుమానితులను ఐసోలేషన్‌ సెంటర్లకు తరలిస్తున్నా చీమకుర్తి పరిసర ప్రాంతాల ప్రజలను మాత్రం కరోనా భయం వెంటాడుతోంది. చీమకుర్తి, ఒంగోలు పరిసరాల్లో కరోనా వ్యాపించడానికి మార్గాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో స్థానికులు, క్వారీ యజమానులు, జనరల్‌ మేనేజర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.  

మైగ్రేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు  
చైనా నుంచి వచ్చే వ్యక్తులను విమానాశ్రయాల్లోనే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మైగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిశిత పరిశీలన చేస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఇండియా వచ్చే వారికి ప్రవేశం కష్టసాధ్యం. కరోనా వైరస్‌ బారినపడిన వారు చీమకుర్తి, ఒంగోలు ప్రాంతాల వరకు వచ్చేందుకు వీలుకాకపోవచ్చు.– కేవీవీఎస్‌ఎస్‌ ప్రసాద్,డీఎస్పీ, ఒంగోలు  

చైనా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా పరీక్షలు
ఒంగోలు సెంట్రల్‌: చైనా నుంచి ఓ కుటుంబం జిల్లాకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన ఓ కుటుంబం చైనాలోని నాన్‌టాంగ్‌ సిటీ, జియాంగ్సు ప్రావిన్సీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తోంది. చైనాలోని ఉహాన్‌ అనే నగరంలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందడంతో ఆ కుటుంబ యజమాని గత నెల 21వ తేదీన ఇండియాకు వచ్చాడు. అనంతరం సొంత గ్రామం గుండమాల చేరుకున్నాడు. ఈ నెల 1వ తేదీన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇండియా చేరుకుని సాంత గ్రామానికి వచ్చారు. ఎయిర్‌ పోర్టులో వీరికి కరోనా వైరస్‌ వ్యాధి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరు గుండమాలలో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు మరోసారి పరీక్షల కోసం స్థానిక జీజీహెచ్‌కు తరలించారు.

కరోనా వైరస్‌ ఇన్‌క్యుబేషన్‌ పిరియడ్‌ దాదాపు 14 రోజులకు పైగా ఉంటుంది. ఈ దశలో వ్యాధి లక్షణాలు పూర్తిస్థాయిలో బయటకు కనిపించవు. బుధవారం జీజీహెచ్‌కు చేరుకున్న వీరిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి కరోనా వైరస్‌ జీజీహెచ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రిచర్డ్స్‌ ఆధ్వర్యంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గొంతు నుంచి స్వాబ్‌లు తీసి పరీక్షల కోసం తిరుపతిలోని స్విమ్స్‌ వైద్యశాలకు పంపించారు. అక్కడి నుంచి స్వాబ్‌లు పరీక్షల కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు వెళ్లాయి. అక్కడి నుంచి నివేదిక జిల్లాకు అందుతుంది. నివేదిక అందేందుకు దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు బయట తిరగరాదని వారికి వైద్యులు సూచించారు. జీజీహెచ్‌లో కరోనా వ్యాధి అనుమానితులు ఉన్నారనే సమాచారంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది ఎన్‌–95 మాస్క్‌లు ధరించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కరోనా అనుమానిత వ్యాధిగ్రస్తుల నుంచి సమాచారం సేకరించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు