ఏడీ ఒక్కరే బాధ్యులా?

8 Aug, 2018 07:04 IST|Sakshi
హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు ప్రాంతంలో దగ్ధమవుతున్న వాహనాలు (ఫైల్‌)

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): ఆలూరు మండలం హత్తి బెళగల్‌ పేలుడు ఘటనకు సంబంధించి మైనింగ్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) నటరాజ్‌ను బాధ్యున్ని చేస్తూ సస్పెండ్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఘటనలో ఒక్కరే బాధ్యులా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించి గ్రామ, మండల స్థాయి అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. క్వారీ ప్రాంతంలో చేపట్టబోయే పనులను, పేలుడు పదార్థాల వినియోగాన్ని ప్రతి మూడు నెలలకోసారి అధికారులు పర్యవేక్షించాలి. అయితే.. ఈ విషయంలో సంబంధిత అధికారులు  నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకంగా మైనింగ్‌శాఖ ఏడీని బాధ్యున్ని చేస్తూ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీచేశారు.
 
పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? 
వాస్తవానికి క్వారీలలో పేలుళ్లకు సంబంధించి రెండు రకాల బ్లాస్టింగ్స్‌ నిర్వహిస్తుంటారు.  కంట్రోల్‌ బ్లాస్టింగ్,  కెమికల్‌ బ్లాస్టింగ్‌ విధానాల్లో నిపుణులైన వారి ద్వారా పేలుళ్లు జరుపుతారు. పేలుళ్లకు వినియోగించే పదార్థాల నిల్వలు, పేల్చిన మొత్తం తదితర వివరాలను  రిజిష్టర్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత క్వారీ యజమానులపై ఉంది.  ఈ విధానాన్ని మొత్తం పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శి, మండల రెవెన్యూ అధికారి, పోలీసుశాఖలపై కూడా ఉంటుంది. కొంత కాలంగా ఈ క్వారీలో పేలుళ్లు యథేచ్ఛగా కొనసాగినప్పటికీ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు ఆరోపణలున్నాయి.

>
మరిన్ని వార్తలు