‘రసాయన’ రోడ్డు ప్రయోగం విఫలం

20 Apr, 2019 13:18 IST|Sakshi
గుంతలు పడుతున్న రోడ్డు

ఫలించని అమెరికా సాంకేతిక పరిజ్ఞానం

నిర్మించిన పది రోజులకే దెబ్బతిన్న రహదారి

అర్ధంతరంగా పనులు నిలిపివేత

గన్నవరం (కృష్ణా): అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గన్నవరంలో ప్రయోగత్మకంగా చేపట్టిన ‘కెమికల్‌ సాయిల్‌ స్టెబిలైజేషన్‌’ రోడ్డు నిర్మాణం విఫలమైంది. గ్రావెల్, మెటల్‌ అవసరం లేకుండానే.. టాప్‌ సీల్‌ కెమికల్‌ను వినియోగించి మట్టిని గట్టిపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో రహదారుల నిర్మాణం చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీకి ఇక్కడ మాత్రం ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పద్ధతిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.45 కోట్లు కేటాయించింది. అమెరికాకు చెందిన టాప్‌ సీల్‌ కెమికల్‌ తయారీ సంస్థ టెర్రా పేబ్‌తో కలిసి కడపకు చెందిన కృష్ణప్ప మినరల్‌ సంస్థ ఈ రోడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది.

పది రోజులకే తూట్లు
తొలుత ప్రయోగాత్మకంగా గన్నవరంలోని జాతీయ రహదారి నుంచి మర్లపాలెం వరకు రెండు కిలోమీటర్ల పొడవున రూ.40 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట శంకుస్థాపన చేశారు. దీనికి అవసరమైన టాప్‌ సీల్‌ కెమికల్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. నెల రోజుల కిందట ప్రయోగాత్మకంగా 90 మీటర్ల పొడవున నిర్మాణం చేపట్టారు. రోడ్డును ఆరు అంగుళాల లోతున దున్ని దానిపై నీటిలో కలిపిన కెమికల్‌ చల్లుతూ గ్రావెల్‌తో చదును చేశారు. ఈ విధంగా నాలుగు, ఐదు రోజుల్లో మూడుసార్లు కెమికల్‌ స్ప్రే, రోలింగ్‌ చేయడం ద్వారా మట్టిని గట్టిపరిచారు. ఈ పనులను అమెరికాకు చెందిన టెర్రా పేబ్‌ కంపెనీ ప్రతినిధి గ్యారీ నిల్సన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు చార్లెస్, నిర్మాణ సంస్థకు చెందిన అంజప్ప పర్యవేక్షించారు.

ఆశించిన ఫలితం రాక
అయితే, కెమికల్‌ సాయిల్‌ స్టెబిలైజేషన్‌ పద్ధతిలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం చివరకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 90 మీటర్ల పొడవున వేసిన రోడ్డు పైభాగంలో మట్టి గట్టి పడలేదు. ఫలితంగా రోడ్డు పైపొర (లేయర్‌) వాహనాల తాకిడికి క్రమంగా దెబ్బతింటోంది. రోడ్డు నిర్మాణం సంతృప్తికరంగా లేకపోవడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డు పదేళ్ల పాటు చెక్కుచెదరదని నిపుణులు చెప్పినప్పటికీ, పది రోజులకే దెబ్బతినడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి మట్టి స్వభావం కారణంగానే అనుకున్న రీతిలో నిర్మాణం జరగలేదని కాంట్రాక్ట్‌ సంస్థ చెబుతోంది. ఈ పద్ధతిలో ఇక్కడ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతికత, యంత్ర పరికరాలు లేకపోవడం, నేల స్వభావం వల్ల అనుకున్న మేర సక్సెస్‌ కాలేకపోయామని నిపుణులు పేర్కొంటున్నారు. లోపాలను సవరించి మరోసారి నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే, పనుల కొనసాగింపుపై పంచాయతీరాజ్‌ అధికారులు మాత్రం పూర్తిస్థాయి నమ్మకం వ్యక్తం చేయడం లేదు.

సంతృప్తికరంగా రాలేదు
ప్రయోగత్మకంగా కెమికల్‌ సాయిల్‌ స్టెబిలైజేషన్‌ పద్ధతిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో నిర్మాణ సంస్థ తాత్కాలికంగా పనులను నిలిపివేసింది. పనుల కొనసాగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– ఎ.వెంకటేశ్వరరావు, డీఈ, పంచాయతీరాజ్‌

మరిన్ని వార్తలు