సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు

27 Aug, 2019 09:22 IST|Sakshi
సముద్రం మధ్యలో నిలిచిన బోట్‌లో చెన్నై మత్స్యకారులు

సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఏడుగురు మత్స్యకారులు

సాక్షి, కోడూరు: చెన్నైకి చెందిన రెండు వేట బోట్లు సాంకేతిక సమస్య కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయి మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఘటన హంసలదీవి సాగరతీరంలో చోటుచేసుకుంది. పాలకాయతిప్ప మెరైన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన నలుగురు మత్స్యకారులు, కాకినాడకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వారం క్రితం రెండు బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ (శనివారం) సాయంత్రం పాలకాయతిప్ప సముద్రతీరానికి వచ్చే సరికి రెండు బోట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో కంగారుపడిన మత్స్యకారులు ఆ రాత్రంతా బోట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం సముద్రం పాటు సమయంలో మత్స్యకారులు బోట్లలో ఉన్న కొన్ని పరికరాల సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎవరికి చెప్పకుండా బోట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. సోమవారం ఉదయం స్థానిక మత్స్యకారులు సముద్రంలో బోట్లు నిలిచి ఉండడాన్ని గమనించి విషయాన్ని పాలకాయతిప్ప మెరైన్‌ పోలీసులకు అందించారు.

ప్రత్యేక పడవలో వెళ్లిన పోలీసులు
మెరైన్‌ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక పడవలో నిలిచిన బోట్లకు వెళ్లారు. బోట్లలో ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. నలుగురు మాత్రమే బోట్లలో ఉండగా మిలిగిన వారు సామగ్రి కోసం విజయవాడ వెళ్లినట్లు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నట్లు మెరైన్‌ సీఐ పవన్‌కిషోర్‌ చెప్పారు. సముద్రంలో చోరబాటుదారులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీకి వెళ్లిన వారిలో ఎస్‌ఐ జిలానీ, రైటర్‌ రెహమాన్‌ జానీ, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు