మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి

14 Jul, 2020 18:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి సీతానగరం వద్ద హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని జిల్లాలో కూడా మోడల్ హౌస్‌లు నిర్మించి.. ఇదే తరహాలో పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన ముడిసరుకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని గృహాలకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని.. సిమెంట్ వంటి సరుకులకు తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇల్లు 2.5 లక్షలు ఖర్చు కావాల్సి ఉంటే సబ్సిడీలతో 1.80 లక్షలకు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. (అక్కాచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వాలనే: సీఎం జగన్‌)

అదే విధంగా అర్బన్‌లో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణమే జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ మోడల్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. ‘‘పేదలకు తొలుత 25 లక్షల ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్‌ భావించారు. అయితే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక బెడ్ రూమ్, హాలు, బాత్ రూమ్, కిచెన్, వరండా ఉండే విధంగా పేదలకు ఇళ్లు నిర్మించనున్నాం’’అని శ్రీరంగనాథరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు