తొలిసారి ఓటు వేయబోతున్నాను : చెస్‌ స్టార్‌

31 Mar, 2019 08:39 IST|Sakshi

సమర్థుడైన నాయకుడికే ఓటు వేయండి

హామీలను సకాలంలో నెరవేర్చాలి

క్రీడాకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలి

భారత చెస్‌ స్టార్‌ ద్రోణవల్లి హారికతో ఇంటర్వ్యూ

ఆమె చదరంగ క్షేత్రంలో తన ప్రత్యర్థులపై ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చెక్‌ పెడుతుంది. ప్రత్యర్థి వేసే ఎత్తులను వెంటనే పసిగట్టి... ఎలాంటి ఎత్తు వేస్తే తనకు విజయం పాదాక్రాంతమవుతుందో ముందుచూపుతో ఆలోచిస్తుంది. చిన్ననాటి నుంచి చదరంగంపై మక్కువతో పావులను తన ఆరో ప్రాణంగా మార్చుకుని జిల్లా స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు చెస్‌ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ వయో విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ చెస్‌ క్రీడాకారిణియే ద్రోణవల్లి హారిక.

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ హారికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత నాలుగో పౌర పురస్కారం ‘పద్మశ్రీ’తో గౌరవించింది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన కాకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయాలని ఆమె సూచించింది. గతంలో ఎన్నికల వేళ టోర్నీలు ఆడుతూ విదేశాల్లో ఉన్నకారణంగా ఓటు వేయలేకపోయానని... ఈసారి కచ్చితంగా తన ఓటును వినియోగించుకుంటానని హారిక తెలిపింది. ప్రభుత్వాలు ఏవైనా దేశం కోసం పేరు తెచ్చే క్రీడాకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారికిచ్చే హామీలను సకాలంలో నెరవేర్చాలని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హారిక తెలిపింది. పలు అంశాలపై హారిక వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 

ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రస్తావించకపోవడానికి కారణమేంటి? ఒకవేళ ప్రస్తావిస్తే ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటారు?
ఇతర రంగాలతో పోలిస్తే క్రీడా రంగంలో ఉండే వారి సంఖ్య తక్కువ. అందుకే రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయవేమోనని నా అభిప్రాయం. నా సలహా ప్రకారమైతే మంచి ఫలితాలు సాధించే క్రీడాకారులకు సముచిత రీతిలో నగదు పురస్కారాలు ఇవ్వాలి. వారికి సరైన సమయంలో సరైన గుర్తింపు ఇవ్వాలి. ముఖ్యంగా క్రీడాకారులకు ఇచ్చే హామీలు సకాలంలో అమలుచేసే చిత్త్తశుద్ధి ఉండాలి. ఈ విషయాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదు. 

క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం ఉండటాన్ని మీరు సమర్థిస్తారా? వారి వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తారా?
క్రీడా సమాఖ్యల్లో క్రీడా నేపథ్యమున్న వారుంటే సత్ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారుల తల్లిదండ్రులకు స్థానం కల్పించినా ఫర్వాలేదు. క్రీడలతో పరిచయం లేని వారుంటే క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయంపై వారికి అవగాహన ఉండదు. 


క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమప్రాధాన్యత ఇస్తున్నాయా? కొందరికి భారీ మొత్తంలో నజరానాలు లభిస్తాయి... మరికొందరిని అసలే పట్టించుకోరు. ఈ విషయంలో మీ అభిప్రాయం?
క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కచ్చితంగా చెప్పగలను. ఎక్కడా సమతుల్యత కనిపించడంలేదు, పాటించడంలేదు. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్న వారికి ఇంకా ఇస్తూ పోతే అది క్రీడాభివృద్ధికి దోహదపడదు. అర్హత లేని వారిని కూడా అందలం ఎక్కిస్తున్నారు. గొప్ప ఫలితాలు సాధించకున్నా ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో నగదు పురస్కారాలు పొందిన వారున్నారు. క్రీడాకారులకు నజరాలు ఇచ్చే విషయంలో లోటుపాట్లు ఉండకూడదనుకుంటే సమర్థులైన క్రీడాధికారులను నియమించాలి. ఏ క్రీడాకారుడికి ఎంత మొత్తం ఇవ్వాలి, వారికి ఏ రకమైన సహాయం అవసరం ఉందనే విషయాలపై వారికి మంచి అవగాహన  ఉండాలి.

మన దేశం క్రీడలను ప్రేమించే దేశమని, క్రీడలు ఆడే దేశం కాదని  గతంలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వ్యాఖ్యానించాడు. క్రీడల్లో భారత్‌ అగ్రగామి కావాలంటే ఏం చర్యలు తీసుకోవాలి?
సచిన్‌ అన్నది నిజమే. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన క్రీడాకారులకు ప్రేమాభిమానాలు లభిస్తాయి. అయితే చాలా దేశాల్లో ఇది కనిపించదు. అయితే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో చాలా మంది రిస్క్‌ తీసుకోవాలనుకోరు. కనీసం డిగ్రీ కలిగి ఉంటే తమ పిల్లలకు ఉద్యోగభద్రత ఉంటుందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఈ విషయంలో ఇప్పుడిపుడే తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ మారుతోంది. అయితే ఇక్కడా ఓ సమస్య ఉంది. అవసరమైనంత సమయం కేటాయించకుండా తక్కువ సమయంలో, తొందరగా సక్సెస్‌ సాధించాలని భావిస్తున్నారు. ఏ రంగంలోనైనా సక్సెస్‌ లభించాలంటే చాలా కష్టపడాలి. ఎంతో ఓపిక ఉండాలి. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. ఇలాంటి రిస్క్‌ తీసుకుంటే క్రీడలపట్ల ఆకర్షితులయ్యే సంఖ్య పెరుగుతుంది. 

రాజకీయాలను, రాజకీయ పార్టీల వార్తలను ఫాలో అవుతారా?
నిజం చెప్పాలంటే అంతగా పట్టించుకోను. అయితే ఇంట్లో సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి అప్పడప్పుడు మాట్లాడుకుంటారు. ఆ సమయంలోనే వాటి గురించి తెలుసుకుంటానుతప్ప ప్రత్యేకంగా రాజకీయాల గురించి ఆలోచించను.

రాబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకుంటారా?
ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన సమయాల్లో నేను దేశం తరఫున టోర్నీలు ఆడేందుకు విదేశాల్లో  ఉండాల్సి రావడంతో ఓటు వేయలేకపోయాను. ఈసారి మాత్రం ఇక్కడే ఉంటున్నాను. తొలిసారి తప్పకుండా నా ఓటు వేయబోతున్నాను.

తెలుగు రాష్ట్రాల ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటి?
తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అభ్యర్థులు మన కులం వాళ్లని, మన మతం వాళ్లని చూడకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయండి. 
–కరణం నారాయణ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా