అతడే రాజు.. అతడే మంత్రి..

22 Aug, 2017 12:34 IST|Sakshi
అతడే రాజు.. అతడే మంత్రి..
► చదరంగం శిక్షణలో రాణిస్తున్న మాదాసు కిషోర్‌
భీమవరం(పశ్చిమగోదావరి): నేటి విద్యావిధానం ర్యాంకులకే పరిమితమవుతోంది. దీంతో ఎక్కువ పాఠశాలలు విద్యాబోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని యాజమాన్యాలకు అవగాహన కల్పించడంతో పాటు చదరంగంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు భీమవరం పట్టణానికి చెందిన మాదాసు కిషోర్‌. చదరంగంతో మేదడుకు పదును, ఏకాగ్రత, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెబుతున్న ఆయన జిల్లాలో జాతీయ, రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నారు.

దివ్యాంగులకు సైతం చదరంగం పోటీలు నిర్వహించి వారిలో మానసిక ధృడత్వానికి కృషి చేస్తున్నారు.  భీమవరం పట్టణానికి చెందిన మాదాసు కిషోర్‌ 2005 నుంచి పట్టణ చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఏటా చదరంగంలో ఉచిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కిషోర్‌ భీమవరం లూథరన్‌ హైస్కూల్లో 9వ తరగతి చదువుకునే రోజుల్లో చదరంగంపై మక్కువ పెంచుకున్నారు. ప్రత్యేకంగా ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా క్రీడపై అవగాహన పెంచుకుని రాణించారు. జాతీయస్థాయిలో చెస్‌ క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2011లో కిషోర్‌ తన తల్లి అనసూయ పేరుతో చెస్‌ అకాడమీని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
 
ఉచితంగా చెస్‌ పాఠాలు
ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని దాదాపు 80 కళాశాలలు, పాఠశాలల్లోని విద్యార్థులకు కిషోర్‌ చదరంగంపై శిక్షణ ఇచ్చారు. భీమవరం పట్టణంలోని శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కేజీఆర్‌ఎల్‌ కళాశాల, డీఎన్నార్, జ్ఞానానంద, ఏలూరులోని సీఆర్‌ రెడ్డి ఉమెన్స్‌ కళాశాల వంటి కళాశాలలు, అనేక పాఠశాలల్లో విద్యార్థులకు చెస్‌ పాఠాలు బోధించారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు కిషోర్‌ తెలిపారు. 
 
200 టోర్నీల నిర్వహణ
గడిచిన ఏడేళ్లలో భీమవరం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, తణుకు తదితర ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో దాదాపు 200 టోర్నమెంట్స్‌ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు కిషోర్‌ వద్ద శిక్షణ పొందినవారిలో  ప్రనూప 2007లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించింది. అదే ఏడాది దివ్యాంగులకు చెస్‌పోటీలు నిర్వహించి చెస్‌ క్రీడాకారులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. 
 
బహుముఖ ప్రజ్ఞాశాలి
కిషోర్‌ చదరంగం నేర్పించడమేకాక కళాకారుడిగా, దర్శకుడిగా, గేయ రచయితగా రాణిస్తున్నారు. 2000లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ‘సర్వేజనా సుఖినోభవంతు’ నాటికను ఆంధ్రాయూనివర్సిటీలో ప్రదర్శించి ప్రథమ బహుమతిని అందుకున్నారు. కిషోర్‌ కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వంతో నీకై నేను.. నాకై నువ్వు వెయిటింగ్‌ ఫర్‌ యూ అనే టైటిల్‌తో ఆడియో, వీడియో ఆల్బమ్‌ను రూపొందించారు. చెస్‌ ఫ్రెండ్‌ అనే మాసపత్రికను నడపడంతో పాటు  చెస్‌ కోర్స్‌ లెవెల్‌–1 అనే పుస్తకాన్ని ప్రచురించారు. 
 
ఏకాగ్రత పెరుగుతుంది
చదరంగంతో అన్ని వయసుల వారిలో ఏకగ్రత పెరుగుతుంది. సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి కూడా పెంపొందించుకోవచ్చు. చెస్‌ క్రీడాపరంగానే కాకుండా చదువులో కూడా ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుంది. – మాదాసు కిషోర్, చెస్‌ కోచ్‌ 
మరిన్ని వార్తలు