ఫలించిన చెవిరెడ్డి పోరాటం

5 Sep, 2018 10:40 IST|Sakshi
పట్టాలు పొందిన అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డితో లబ్ధిదారులు

మంగళంవాసుల చేతికి ఇంటి పట్టాలు

ఎమ్మెల్యే దీక్షతో దిగివచ్చిన రెవెన్యూ సిబ్బంది

ఇంటింటికీ వెళ్లి అందించిన అధికారులు

నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే దీక్షను విరమింపచేసిన మహిళలు

కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

రాజకీయాలకు అతీతంగా దీక్ష విజయవంతం: చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌/మంగళం: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటంతో మంగళం వాసుల ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. లబ్ధిదారులకు ఇవ్వకుండా రెవెన్యూ కా ర్యాలయాలకే పరిమితం  అయిన ఇంటి పట్టాలు... ఎమ్మెల్యే దీక్షతో ఇంటికే వచ్చి లబ్ధిదారుల చేతుల్లో వాలాయి. పార్టీలకు అతీతంగా పోరాడి సాధించుకున్న ఇంటి పట్టాలను చేతపట్టుకుని తమ కోసం మెతుకు కూడా ముట్టకుండా రోజుల తరబడి పోరాడిన ఎమ్మెల్యే చెవిరెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకుని త మ అభిమానాన్ని చాటుకున్నారు. లబ్ధిదా రులు, మహిళలు ఎమ్మెల్యే చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేశారు. రాజకీయాలకు అతీతంగా చేసిన పోరా టం విజయవంతం అయిందని, వందలా ది మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

743 పట్టాలు పంపిణీ...
మంగళం వాసులకు మంజూరైన 786 ఇంటి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూఅధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం నిరాహారదీక్షకు దిగారు. లబ్ధిదా రుల ఇంటికి వచ్చి పట్టాలు ఇచ్చేంత వరకు తాను దీక్ష విరమించేది లేదని భీష్మించుకున్నారు. మంగళం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన దీక్షకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో అలజడి మొదలైంది. అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్, ఆర్‌ఐలు ప్రేమ్‌కుమార్, రామచంద్ర 14 మంది గ్రామ రెవెన్యూ అధికారులతో పట్టాల పంపిణీని ప్రారంభించారు. మూడు బృందాలుగా వారు మంగళవారం సాయంత్రానికి 743 పట్టాలను పంపిణీ చేశారు. మరో 43 మంది లబ్ధిదారులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, వారికి బుధవారం అందిస్తామని తహసీల్దార్‌ చంద్రమోహన్‌ తెలిపారు.

ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ....
అందరినీ ఒకచోటకు పిలిపించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. కానీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెవెన్యూ అధికారులు 743 ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే లబ్ధిదారులకు పట్టాలను అందించారు.

జీవితాంతం రుణపడి ఉంటాం...
తమ ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని మంగళం వాసులు పేర్కొన్నారు. తమ ఇంటి పట్టాలను చేతపట్టుకుని వచ్చి ఆయనకు చూపి తమ ఆనందాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పోరాడి పరిష్కరించిన ఘనత చెవిరెడ్డికే దక్కిందని వారు కొనియాడారు.

నిమ్మరసంతో దీక్ష విరమణ..
పట్టాలు తీసుకున్న అనంతరం మంగళం వాసులు పంచాయతీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ తమకోసం దీక్ష కొనసాగిస్తున్న  ఎమ్మెల్యే  చెవిరెడ్డికి పలువురు మహిళలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చెవిరెడ్డి సహకారంతోనే ఒక్క రూపాయి కూడా ఏ అధికారికీ, ఏ నాయకుడికీ చెల్లించకుండానే తమ జీవిత కల నెరవేరిందని పేర్కొన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలబడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష కొనసాగించిన ఎమ్మెల్యే మేలు ఈ జన్మలో మరిచిపోలేమని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తికి బ్రహ్మరథం పట్టారు. ఈ సం దర్భంగా పట్టాలు అందుకున్న లబ్ధిదారులు, గ్రామస్తులు చెవిరెడ్డిని గజమాలలతో సత్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

శెట్టిపల్లి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం ఎమ్మెల్యే చెవిరెడ్డి
పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో తాను నిరాహార దీక్ష చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ దీక్షలో అన్ని వర్గాల వారు పాల్గొనడంతో ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కరం లభించిందన్నారు. ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటామన్నారు. మంగళంలో నీటి ఎద్దడిని అరికట్టేం దుకు తాత్కాలికంగా మూడు ట్యాంకరు ట్రాక్ట ర్లు ఇస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు