దాడులు చేసినా సహించా : చెవిరెడ్డి

4 Feb, 2019 20:20 IST|Sakshi

సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా ఉన్న వ్యక్తినని తానని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మినెలల్లో ఏ రోజు కూడా వ్యక్తి గత విమర్శలకు పోలేదని తెలిపారు. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉన్నా. నేను కూడా రాజకీయంగా విమర్శలు చేస్తే ప్రజల్లో అలజడి వస్తుందని, పచ్చగా ఉన్న పల్లెల్లో ప్రశాంతత కోల్పోతుందని తెలుసు. దానికి నేను కారణం కాకూడదనుకున్నా. అందరికీ శాసన సభ్యుడినైన నేను అందరినీ కలుపుకుంటూ పోయా. తెలుగుదేశం పార్టీ వాళ్లు వచ్చినా నేను ఆభివృద్ధి పనులకు ఆటంకం చెయ్యలేదు. చంద్రగిరిలో జీవిస్తున్న వారి జీవన స్థితిగతులు నాకు తెలుసు. నేడు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏనాడు గొడవలను ప్రోత్సహించలేదు. కానీ నేడు తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. నేను చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టా, చదువుకుంది, పదవులు పొందింది ఇక్కడే. అందుకే నియోజకవర్గంలో ఎన్నిగొడవలు ఉన్నా సర్థిచెప్పా. ఏనాడు అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ రోజు నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. గొడవలతో ప్రజలు నిత్యం ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ విష సంస్కృతిని ఎలా అరికట్టాలో అర్థం కావటం లేదు.

చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతకు ముందున్న ఎమ్మెల్యేల మంచి సాంప్రదాయాన్ని నేను కొనసాగించా. మీరు దాడులు చేసినా సహించా, అది భయపడి కాదు. నాపై దాడి చెయ్యడానికి ప్రయత్నించిన వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. పసుపు కుంకుమ కార్యక్రమం ప్రభుత్వానిది. అందుకే వెళ్లా. నేను వెళ్లింది జన్మభూమి కార్యక్రమానికి కాదు. నా కుటుంబసభ్యులు తప్పు చేసిన నేను వ్యతిరేకిస్తా' అని అన్నారు.

మరిన్ని వార్తలు