భయం గుప్పిట్లో ‘తూర్పు’ మన్యం

2 Dec, 2014 00:21 IST|Sakshi
భయం గుప్పిట్లో ‘తూర్పు’ మన్యం

 రంపచోడవరం :రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుకుమ జిల్లాలో మావోయిస్టుల రక్తపాతాన్ని సృష్టించి, పలువురు పోలీసులను పొట్టన పెట్టుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపింది. వాస్తవానికి ఈ ఘటనకు ముందే గత కొన్ని వారాలుగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా జిల్లాలో వరుస పెట్టి మిలీషియా సభ్యులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. పోలీసులు సైతం నిఘాను, ఒత్తిడిని పెంచారు. ఈ నేపథ్యంలో సుకుమలో మందుపాతర సంఘటన ఇక్కడ ఏజెన్సీలో కలకలం సృష్టించింది. విస్తృతస్థాయిలో గాలింపు చేపట్టిన పోలీసులకు తాజా సంఘటన పెనుసవాలుగా మారింది.
 
 జిల్లా కేంద్రం కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు సర్వీసులను, అటూ విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే కొన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే మావోయిస్టులకు సహకరిస్తున్నారని పోలీసులు, పోలీసులకు సహకరిస్తున్నారని మావోలు గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడంతో అటవీ గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మిలీషియా సభ్యుల ద్వారా  గ్రామాల్లో పట్టు సాధించేందుకు మావోయిస్టుల కసరత్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు మిలీషియా సభ్యుల అరెస్టులు, లొంగుబాట్లపై దృష్టి సారించారు. కాగా మంగళవారం నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాల నేపథ్యంలో మావోలు దాడులకు తెగబడే అవకాశం ఉందని మారుమూల పోలీస్ స్టేషన్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
 
 ఇన్‌ఫార్మర్లే మావోయిస్టుల లక్ష్యం!
 ఆంధ్రా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తరించిన దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం మావోయిస్టులకు రక్షణ స్థావరంగా ఉంది. మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకూ మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా ఇన్‌ఫార్మర్లే టార్గెట్‌గా మావోయిస్టులు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు వ్యూహరచన చేసినట్టు తెలిసింది. తాజా సంఘటనతో  దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. చింతూరు మండలం సరిహద్దుల్లో మావోయిస్టులు శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వేయడం  వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిని వారు లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. సుకుమ ఘటన, పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో జిల్లా మన్యంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.  
 

>
మరిన్ని వార్తలు