జనాలతో..ఆటలమ్మ

22 Apr, 2018 07:18 IST|Sakshi
ఆటలమ్మతో బాధపడుతున్న మంత్రి సూర్యనారాయణ

కొండదాడిలో విజృంభించిన చికెన్‌పాక్స్‌

ఒకే ఊరిలో 100మందికి పైగా బాధితులు

శరవేగంగా వ్యాపిస్తున్న వ్యాధి

గరివిడి (చీపురపల్లి) : గరివిడి మండలం కొండదాడి గ్రామంలో చికెన్‌పాక్స్‌ (ఆటలమ్మ) విజృంభిస్తోంది. సరాసరి రోజున 5 నుంచి ఆరుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం 100 మందికి పైగా ఆటలమ్మ బాధితులు ఊర్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రతీ ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు బాధితులు ఉన్నారని పేర్కొంటున్నారు. తొలుత నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వారికి ఎలాగోలా తగ్గినా ఆ రోజు నుంచి వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం మొదలైంది. 

ఊపందుకున్న పుకార్లు..
ఊరంతా అమ్మవారి బారిన పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది గ్రామ దేవత పండగను సరిగా నిర్వహించకపోవడం వల్లే అమ్మవారు ఉగ్రరూపం దాల్చి ఇలా ప్రతాపం చూపిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే బాధితుల బాధలు మాత్రం వర్ణనాతీతం. ఇంటి చిట్కాలు, నాటు వైద్యం పాటించి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మూఢ నమ్మకాలను పట్టుకుని అశాస్త్రీయ పద్ధతిలో చికిత్సలు చేయించుకుంటుండడంతో వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడమే కాక మరింత మందికి వ్యాపిస్తోంది.

పీహెచ్‌సీకి వెళ్లినా..
కొంతమంది వైద్యం కోసం బొండపల్లి పీహెచ్‌సీ గడప తొక్కినా అక్కడి వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదు. నిజానికి విషయం తెలుసుకోగానే వైద్యులు అప్రమత్తమై సకాలంలో వైద్య సేవలందించాలి. శాస్త్రీయ పద్ధతుల వైద్యాన్ని వారికి పరిచయం చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటిది జరిగిన దాఖలాలు లేవు. వైరస్‌ ద్వారా వ్యాపించే చికెన్‌ పాక్స్‌ వేసవి వాతావరణం అనుకూలంగా ఉండడంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర గ్రామాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.

ఉన్నతాధికారులు స్పందించాలి..
ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగ జేసుకుని వ్యాధి బారినుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మొదట్లోనే వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేదని, ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఒక సారి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించలేదని చెబుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మంత్రి సూర్యనారాయణ, మంత్రి వసంత, వినయ్, మండాది అప్పయ్యమ్మ, బార్నాల తవుడమ్మ, మండాది రాము, బంగారమ్మ తదితర 100 మంది రోగులు వ్యాధితో మంచం పట్టారు.

పీహెచ్‌సీ సిబ్బంది పట్టించుకోవడం లేదు..
బొండపల్లి పీహెచ్‌సీ అధికారులు ఆటలమ్మ వ్యాధితో బాధపడుతూ వెళ్తే పట్టించుకోవడం లేదు. కొంత మంది సిబ్బందికి ఆటలమ్మ వ్యాధి సోకిందన్న విషయమే తెలియదు. ఏదో రెండు నెలలకోసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారే తప్ప గ్రామంలో సమస్యలు పట్టించుకోవడం లేదు.
– కొండదాడి వాసులు.

నా దృష్టికి రాలేదు..
కొండదాడిలో ఆటలమ్మ విజృంభిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. రాజకీయ నాయకులు, ప్రజలు ఎవరైనా వచ్చి చెబితే చర్యలు తీసుకునేదాన్ని. స్థానిక నేతలను అడిగి వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకుంటా.
– ఎన్‌.భార్గవి, బొండపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి

మరిన్ని వార్తలు