అగ్గువ రండన్నో!

12 Feb, 2020 12:52 IST|Sakshi

కర్నూలు, కోడుమూరు: ‘ఏమన్నా..కోడికూర కావాలా? మా దగ్గర చాలా ఛీపు. రండి రండి ఎనభై రూపాయలకే కేజీ ఇత్తాం’ అంటూ వ్యాపారుల పిలుపు.,‘మరీ అంత అగ్గువా? ఐతే కేజీ కొట్టు. మంచి ఛాన్స్‌ ఇదే. ఫుల్లుగా లాగించేయాలి!’ అంటూ వినియోగదారుల సంతోషం.ఇదీ మంగళవారం కోడుమూరులో పరిస్థితి. వ్యాపారుల మధ్య  పోటీ కారణంగా చికెన్‌ ధర అమాంతం తగ్గించేశారు. పట్టణంలో ఇటీవల రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిలో రూ.130 చొప్పున చికెన్‌ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇస్తానని ఆఫర్‌ ప్రకటించాడు.

ఈ లెక్కన కిలో చికెన్‌ రూ.100కే దొరుకుతుండడంతో వినియోగదారులు భారీగా ఎగబడ్డారు. దీంతో మిగిలిన వ్యాపారులూ ‘చౌక బేరం’ మొదలుపెట్టారు. మంగళవారం స్థానిక కోట్ల సర్కిల్‌లో మాసుం అనే వ్యాపారి రూ.100కే కిలో చికెన్‌ విక్రయించాడు. దీంతో సురేష్‌ అనే వ్యాపారి మరీ తక్కువగా రూ.80తో అమ్మడం మొదలుపెట్టాడు. జనం ఎగబడ్డారు. ఒక్క రోజులోనే 200 కిలోలకు పైగా చికెన్‌అమ్ముడుబోయినట్లు  సురేష్‌ తెలిపాడు. వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్‌ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం బహిరంగ మార్కెట్లో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.180, స్కిన్‌తో కలిపి రూ.150 ధర పలుకుతోంది.  

మరిన్ని వార్తలు