చికెన్.. ధర ‘చిక్కెన్’!

12 Nov, 2013 00:36 IST|Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: మొన్నటి దాకా చుక్కలు చూపించిన చికెన్ ధర ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. మార్కెట్‌లో ఒకవైపు కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగిపోతుంటే చికెన్ ధర మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. ఇరవై రోజుల క్రితం రూ. 200 పలికిన కిలో చికెన్.. ఇప్పుడు రూ.70కి పడిపోయింది. చికెన్ ప్రియులు ఈ ధరల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల దాణా ధరలు విపరీతంగా పెరగడం, చికెన్ ధరలు పడిపోవడమే వీరి ఆందోళనకు కారణం. కిలో చికెన్ ఉత్పత్తికి దాణాఇతరత్రా ఖర్చులతో కలుపుకొంటే రూ.90 ఖర్చవుతుంది. అయితే మార్కెట్‌లో రైతు కిలో కోడి ధర రూ.38లే పలుకుతుండంతో గిట్టుబాటు కావడంలేదు. ప్రధానంగా దసరా పండుగ నుంచి మార్కెట్ తగ్గుముఖం పడుతూ వస్తోంది.
 
 బక్రీద్  సందర్భంగా ముస్లింలు ఎక్కువగా మేక మాంసాన్నే  ఇష్టపడటంతో గిరాకీ లేక చికెన్ స్టాక్ మిగిలిపోయింది. దీనికి తోడు రోజువారీ ఉత్పత్తి ఉండనే వుంది. ఇదంతా కలుపుకొని చికెన్ మార్కెట్‌లోకి అధికోత్పత్తి కావడంతో ధరలు అమాంతం తగ్గుతూ వస్తున్నాయి. మామూలుగా అయితే 10-15 శాతం చికెన్ ఉత్పత్తి వుంటే సరిపోతుంది. కానీ దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి వుండటం, ప్రణాళికలను పాటించని ఉత్పత్తి కేంద్రాలు వుండటమే ఈ స్థితికి కారణమని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మొహర్రం, కార్తీక మాసాలు వుండటం.. మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సరుకు రావడంతో చికెన్ ధరలు తగ్గుతున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుండటం పరిపాటి. కానీ ఈ సారి ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు వున్న వాటికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలావుంటే రాబోయే రోజుల్లో బ్రాయిలర్ రంగం భరోసా లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.  
 
 భగ్గుమంటున్న కూరగాయలు
 ఒకవైపు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుంటే కూరగాయలు మాత్రం భగ్గుమంటున్నాయి. కిలో వంకాయలు ఇరవై రోజుల క్రితం రూ. 20 వుండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. బెండ రూ.30, బీర రూ.50, పచ్చిమిర్చి రూ.40, టమాటా రూ.30, ఆలుగడ్డ రూ.40, చిక్కుడు రూ.60, దొండ రూ.50, గోకరకాయ రూ.50కు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇటీవలి వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీగా కూరగాయల పంటలు నష్టపోయాయి. వారం పాటు నీటిలోనేవుండటంతో ఆకుకూరలు, కూరగాయలు కుళ్లిపోయాయి. ఈ క్రమంలో భారీగా కొరత ఏర్పడింది. బయటి ప్రాంతల నుంచి కూడా కూరగాయలు తక్కువ స్థాయిలో వస్తున్నాయి. పెద్దమొత్తం వెచ్చించి వాటిని కొనుగోలు చేసేకంటే మాంసం కొనుక్కోవడమే మేలనే అభిప్రాయం మాంసాహారుల్లో వ్యక్తమవుతోంది. కార్తీకమాసం ప్రా రంభమవడం, అయ్యప్ప మాలధారులు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారులు అంటున్నారు. కాగా గుడ్డు ధర మాత్రం పుంజుకుంటోంది. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు దాదాపు రూ.4కు లభిస్తోంది. దీంతో గుడ్డు తినేవారికి గడ్డు పరిస్థితి ఏర్పడింది.
 
 అధికోత్పత్తే ప్రధాన కారణం..
 మార్కెట్‌లో పరిమితికి మించి చికెన్ ఉత్పత్తి కావడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పౌల్ట్రీ ఆశాజనకంగా లేని సమయాల్లో రూ.లక్షలు పెట్టి రైతులు ఈ రంగంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనిని సాకుగా చూపిస్తూ ధరల్ని అమాంతం తగ్గిస్తున్నారు. పౌల్ట్రీ లాభాల్లో వుండాలంటే ముందుగా ఈ రంగం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదిలేకనే చాలామంది నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ పరిశ్రమ అయితే భరోసా లేకుండాపోతోంది. ఇరవై రోజుల్లోనే చికెన్ ధరలు సగానికిపైగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 - జక్కా రాంరెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ హైదరాబాద్ రీజియన్ ప్రెసిడెంట్
 
 నిరాశలో వ్యాపారులు..
 మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా చికెన్ మనకు ఎక్కువగా వస్తోంది. దీనికి తోడు కార్తీక మాసం కారణంగా చికెన్ ధరలు పడిపోయాయి. రేటు తగ్గడంతో గిరాకీ బాగుంది. గతంలో కంటే దాదాపు ఒక రిటైల్ షాపు వారు కనిష్టంగా 150కిలోల చికెన్‌ను అమ్ముతున్నారు. చికెన్ ఎక్కువగా అమ్ముడవుతోంది కానీ సంపాదన గతంలో కంటే మించడం లేదని చికెన్ షాపుల వారు నిరాశ చెందుతున్నారు.
 - లక్ష్మణ్‌రెడ్డి, చికెన్ రిటైల్ ట్రేడర్
 

మరిన్ని వార్తలు