హోదాతో ఎక్కువ రాయితీలు రావు: చంద్రబాబు

7 Oct, 2016 04:36 IST|Sakshi
హోదాతో ఎక్కువ రాయితీలు రావు

* తప్పులు చేస్తే ఇప్పుడు జనం నోరు తెరవరు..
* ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇస్తారు: టీడీపీ వర్క్‌షాపులో చంద్రబాబు


సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు వస్తాయనే రీతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనాన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో 1.47 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లైందన్నారు.

గురువారం మూడో రోజు నిర్వహించిన టీడీపీ నాయకత్వ-సాధికారత వర్క్‌షాపు ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు.. సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులుగా తప్పులు చేస్తే జనం ఇప్పుడు నోరు తెరవరు.. కానీ ఎన్నికల్లో సెలైంట్‌గా జడ్జిమెంట్ ఇస్తారు జాగ్రత్త అంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన సేవలు అందకపోతే సహించరని చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల్లో 80 శాతం సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80 శాతం, నాయకుల పనితీరు పట్ల 80 శాతం అనుకూలత రావాలన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని కోరారు. రాజకీయనేత నైపుణ్యాలు, ఆర్థిక వేత్త నైపుణ్యాలు వేర్వేరు కాబట్టే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు పొలిటికల్ ఇమేజీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచామన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వారికి చేసిన ప్రయోజనాలు వివరించి పార్టీకి దగ్గరయ్యేలా చూడాలని కోరారు. గోదావరిని పెన్నాకు కూడా అనుసంధానం చేసి సోమశిల వరకు నీటిని తీసుకెళ్తామన్నారు.
 
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు  శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో బాబు ప్రసంగిస్తారు.  సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు.

మరిన్ని వార్తలు