బాసలు గుర్తున్నాయా ‘బాబూ’?

8 Jan, 2016 00:14 IST|Sakshi

అమలాపురం :జిల్లాకొచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినా, అడగకున్నా వరాలు గుప్పించేస్తారు. ఏ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనకు వస్తే వాటికి రూ.కోట్లు మంజూరు చేస్తామని ప్రక టిస్తారు. ‘మా బాబు వరాలిచ్చేశారు. పనులు పూర్తికావడమే ఆలస్య’మని తెలుగుతమ్ముళ్లు చంకలుగుద్దుకుంటారు. తీరా ఇస్తామన్న కోట్లు వాస్తవంలో విడుదల కాక పనులన్నీ శంకుస్థాపన ఫలకాలకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి వాటిలో జిల్లా పర్యాటకాభివృద్ధి ఒకటి. బీచ్ ఫెస్టివల్ ప్రారంభానికి శుక్రవారం కాకినాడ వస్తున్న నేపథ్యంలో పర్యాటకాభివృద్ధిపై బాబు ఇచ్చిన గత హామీలను నెరవేర్చాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
 
 జిల్లాను రాష్ట్రంలోనే పర్యాటకంగా అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చెబుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా రూ.76.5 కోట్లు వ్యయం కాగల పనులకు శంకుస్థాపన చేశారు. గత మేలో కాకినాడ బీచ్ వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ మండలంలో ఎన్టీఆర్ బీచ్‌కు రూ.35.77కోట్లు, ఈ బీచ్‌కు వెళ్లే నాలుగు వరసల రహదారి, ఉప్పుటేరుపై వంతెన పనులకు రూ.10 కోట్లు, కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వద్ద పనులకు రూ.93లక్షలు, సముద్రతీరాన్ని ఆనుకుని అల్లవరం మండలం ఓడలరేవు వద్ద రిసార్ట్స్‌కు రూ.2.10 కోట్లు, ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం రిసార్ట్స్‌కు రూ.3.68 కోట్లు, కాట్రేనికోన మండలం చిర్రయానాంలో రిసార్ట్స్‌కు రూ.4.78కోట్లు, గోదావరిని ఆనుకుని కె.గంగవరం మండలం కోటిపల్లిలో రిసార్ట్స్‌కు రూ.2. 14కోట్లు, మామిడికుదురు మండ లం ఆదుర్రు బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి రూ.2.93 కోట్లు మంజూరు చేసి ఈ పనులన్నింటికీ సంబంధించి వాకలపూడి వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఏడు నె లలు గడిచినా ఒక్క రూపాయి కూ డా విదల్చకపోవడం చూస్తే సీఎం కు పర్యాటకాభివృద్ధిపై చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అర్థమవుతుంది.
 
 కన్వెన్షన్ సెంటర్‌దీ అదే గతి
 పుష్కరాలకు ముందు రాజమండ్రిలో నిర్మిస్తానన్న సిటీ కన్వెన్షన్ సెంటర్‌కు సైతం చంద్రబాబు మే ఒకటినే శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ అక్కడ పునాదిరాయి కూడా పడలేదు. ఇక రాజమండ్రిలో పీపీపీ పద్ధతిలో ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్ల నిర్మాణాలకు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం చెప్పినా వాటి జాడ ఇప్పటికీ లేదు. పాపికొండలు, మారేడుమిల్లి వంటి ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాభివృద్ధి సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికైనా బాబు ప్రకటనలు మాని చేతల్లో పర్యాటకాభివృద్ధిని సాధించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు