కడగండ్ల ఉప్పెనలో ‘కడలి’ బిడ్డలు..

23 Mar, 2019 11:02 IST|Sakshi

సాక్షి, పిఠాపురం: ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని ఊయలలుగా, అగాధ జలధిని గంగమ్మ ఒడిగా భావించే  ధీరులు వారు. కడలి కడుపులోని మత్స్యసంపదను వేటాడడమే వారి బతుకు బాట. సముద్రంపై సునాయాసంగా వేట సాగించే వారికి.. అలా వేటాడి తెచ్చిన చేపలను ఒడ్డుకు చేర్చడం తుపానులో నావను నడపడమంత కష్టతరమవుతోంది. వారి కష్టాలను గట్టెక్కించే మినీ హార్బర్‌ నిర్మాణం పాలకుల కపటపు హామీలకే పరిమితమవుతోంది. ‘గెలిపిస్తే మీ సమస్యలను చిటికెలో తీరుస్తాం. మినీ హార్బర్‌ నిర్మిస్తాం’ అని నమ్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌వర్మ ఎన్నో వాగ్దానాల్లాగే దాన్నీ విస్మరించారు. దాంతో గంగపుత్రులైన మత్స్యకారులు.. వలలో చిక్కిన చేపల్లా వెతల్లో కొట్టుమిట్టాడుతున్నారు.  

మత్స్యకారుల కష్టాలను గట్టెక్కిస్తామన్న సీఎం  చంద్రబాబు, ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ‘ఒడ్డు ఎక్కాక నావ తగలేసిన’ చందంగా ద్రోహం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు.  వందల బోట్లు, వేలమంది మత్స్యకారులు ఉన్న  జిల్లాలో మూడు మండలాలకు చెందిన మత్స్యకారులకు మినీ హార్బర్‌ నిర్మాణం జరగకపోవడం పెనుసమస్యగా మారింది. చేపలవేటే ఆధారంగా సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుండగా అతి ముఖ్యమైన జెట్టీలు లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

ప్రాణాలకు తెగించిన సముద్రంపై చేపల వేట సాగించే వారిని జెట్టీ సమస్య పీడిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ వకూ ఉన్న తీర ప్రాంతంలో కాకినాడలో తప్ప ఎక్కడా జెట్టీలు కాని, హార్బర్‌లు కాని లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు  వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లకు లంగరు వేసేందుకు మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సమీపంలోని హార్బర్‌లో మాత్రమే ఈ మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు నిలిపి చేపల క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది తప్ప మరే ఇతర సౌకర్యాలు లేవు. 

ప్రణాళికలకే పరిమితం
 మత్స్యకారులు తమ అగచాట్లను  గతంలో కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన మినీ హార్బర్‌ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్‌ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ  హార్బర్‌ నిర్మాణానికి అనువని అధికారులు గుర్తించారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో  నిర్మాణానికి ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయి. అయితే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

దీంతో నిర్మాణ  వ్యయం పెరుగుతూ రూ.300 కోట్లకు చేరింది.     గతంలో కొత్తపల్లి, తొండంగి, తుని  మండలాల్లోని మత్స్యకారుల బోట్లను కాకినాడ హార్బర్‌లోకి అనుమతించక పోవడంతో  కొన్ని ఏళ్లుగా వారు ఉప్పాడ సమీపంలో ఉన్న ఉప్పుటేరుని జెట్టీగా ఉపయోగించుకుంటున్నారు. ఏ మాత్రం అనువుగా లేకపోయినా గత్యంతరం లేని స్థితిలో బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి, వేటాడిన చేపలు ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించుకోవల్సిన పరిస్థితులు  నెలకొన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు.

తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఉప్పుటేర్లు లేకపోవడంతో బోట్లను సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది.  తుపాన్లు సంభవించినప్పుడు కెరటాల ఉధృతితో సముద్రంలోని బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. జెట్టీ లేక సముద్రంలోనే లంగరు వేస్తే బోట్లు  మునిగి తీవ్ర నష్టం చవిచూస్తున్నామని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. మామూలు సమయాల్లో  బోట్లపై వేటకు వెళ్లి తిరిగి వచ్చి సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. 

విలువైన బోట్లకు రక్షణ కరువు
జెట్టీలు లేక వేటాడి తెచ్చిన చేపలను దింపేందుకు బోటును ఒడ్డు వరకూ తీసుకు రావాల్సి వస్తోంది. దాంతో పాటు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో బోట్లు, వలల వంటి విలువైన సామగ్రిని అతి కష్టం మీద తీవ్ర వ్యయప్రయాసలకోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఎలాంటి రక్షణా లేకుండా ఒడ్డుకు చేర్చుకోవల్సి వస్తోంది. దీంతో విలువైన బోట్లకు రక్షణ లేకుండా పోతుంది.

అత్యవసర పరిస్థితుల్లో  బోట్లను ఒడ్డుకు చేర్చుకొనే ప్రయత్నంలో ఉన్న మత్స్యకారులకు హార్బరే సురక్షిత ప్రాంతం  అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో హార్బర్‌ లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను తీవ్ర వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు చేర్చుకోవాల్సి వస్తోంది. హార్బరు, జెట్టీలు లేక డీజిల్, ఐస్, వంట సామగ్రిలను కెరటాల అవతల లంగరు వేసిన బోట్ల వద్దకు పట్టుకువెళ్లి నింపుకోవాల్సిన అగత్యం తప్పడం లేదు. కెరటాల అవతల లంగరు వేసిన బోట్లలో డీజీల్, ఐస్, వంట సామగ్రి చోరీ అవుతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు.

కష్టంతో పాటు నష్టాలే ఎక్కువ..
వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చుకొని అమ్ముకోవడానికి హార్బర్‌లో అయితే అన్ని సౌకర్యాలూ ఉండడం వల్ల చేపలు పాడవకుండా వెంటనే అమ్మకాలు జరిగి మత్స్యకారులు నష్టపోరు. అయితే పై మూడు మండలాల్లోని మత్స్యకారులకు హార్బర్‌ లేక చేపల అమ్మకాల్లో తీవ్ర జాప్యం ఏర్పడి నష్టాలు తప్పడం లేదు. వ్యాపారులు కాకినాడ హార్బర్‌కే పరిమితమౌతుండడంతో ఇక్కడ వేటాడిన చేపలను వేరే వాహనాలపై కాకినాడ హర్బర్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు