గెడ్డలో కలిసిన చంద్రబాబు హామీ !

6 Jun, 2015 00:29 IST|Sakshi

 రెల్లుగెడ్డతో పొంచిఉన్న ముంపు సమస్య
  పొందూరు :పొందూరు మండలంలోని రెల్లుగెడ్డతో ఉన్న ముంపు సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ గెడ్డలో కలిసిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. రెల్లుగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఏటా పంటపొలాలు ముంపు బారిన పడుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలుగ్రామాల గుండా ఈ గెడ్డ ప్రవహిస్తున్నప్పటికీ మొదలవలస పరిసర గ్రామాల పరిధిలోని పంటలను తీవ్రంగా ముంచేస్తోంది. ప్రతీ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే వరదలతో పంటలు నాశనమవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానుకు పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అదే నెల 15వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెల్లుగెడ్డ ముంపు ప్రాంతమైన మొదలవలసను స్వయంగా పరిశీలించారు. ఈ గెడ్డ నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత దీన్ని పట్టించుకోవడం మానేశారు.
 
  గోరింట, గోకర్నపల్లి, తాడివలస, మొదలవలస, సింగూరు గుండా రెల్లుగెడ్డ ప్రవహిస్తుంది. వర్షాలు భారీగా కురిసినప్పుడు గోరింట, గోకర్నపల్లి, తాడివలస గ్రామాల నుంచి వచ్చే నీరు మొదలవలస వద్ద కలిసి నీటి ప్రవాహం ఎక్కువైపోతుంది. సింగూరు గుండా నాగావళిలో కలవాల్సిన నీరు తిరగి మొదలవలస వైపునకు పోటెత్తి మొదలవలసతో పాటు బొడ్డేపల్లి, అచ్చిపోలవలస, కింతలి గ్రామాల పరిధిలోని పంట పొలాలను ముంచేస్తుంది.  పొందూరుకు ఎగువ ప్రాంతాలైన రాజాం, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో కురిసిన భారీ వర్షాల నీరు రెల్లుగెడ్డలో ప్రవేశించి వరి పొలాలను ముంచుతుంది. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఈ గెడ్డ పరీవాహక ప్రాంతాల్లో పంటలను రైతులు నష్టపోవడం పరిపాటిగా జరుగుతుంది. బొడ్డేపల్లి, సింగూరు మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నదిలో నీటిమట్టం పెరిగితే ఆ నీరంతా సింగూరు వద్ద రెల్లుగెడ్డలో కలవటంతో పంటలు మునిగిపోతున్నాయి.
 
 విలువ లేని హామీ
  వర్షాకాలంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు రెల్లుగెడ్డను ఆధునీకరించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వవిప్ కూన రవికుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబకు ఈ ప్రాంతంపై పూర్తి సమాచారం అందించారు. దీంతో సీఎం మొదలవలస వచ్చి రె ల్లుగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. దీన్ని ఆధునీకరించి ముంపు సమస్యలేకుండా చేస్తామనని హామీ ఏడు నెలలైనా ఆచరణకు నోచుకోలేదు. కనీసం పట్టించుకోవడం లేదు.  గెడ్డను ఆధునికీరించాలంటే సుమారు రూ. 4 కోట్లు ఖర్చుయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూడు వేల ఎకరాలకు రక్షణ కలుగుతుంది. సుమారు 1500 రైతు కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది.
 
 అది ఉత్తుత్తి హామీ
 గత ఏడాది అక్టోబర్ 15న చంద్రబాబు మొదలవలస వచ్చి రెల్లుగెడ్డ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఉత్తుత్తి హామీగానే మిగిలింది. మళ్లీ వర్షాకాలం సమీపిస్తుండడంతో రైతుల్లో గుబులు ప్రారంభమైంది. ఇప్పటికైనా రెల్లుగెడ్డపై దృష్టి సారించాలి.
 - మొదలవలస రామస్వామినాయుడు,
 ఎంపీటీసీ మాజీ సభ్యులు,
 మొదలవలస
 

మరిన్ని వార్తలు