పారిశ్రామిక వాడగా శ్రీసిటీ

26 Apr, 2016 03:43 IST|Sakshi
పారిశ్రామిక వాడగా శ్రీసిటీ

హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ  శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పారిశ్రామిక వాడగా శ్రీసిటీ.. ప్రజారాజధానిగా అమరావతి అంతర్జాతీయ స్థాయిలో శాశ్వతంగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీసిటీలో ఏర్పాటుచేసిన మాండలెజ్ (క్యాడ్‌బరీ) పరిశ్రమ తొలిదశ ఉత్పత్తులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ పరిశ్రమలకు అత్యంత అనువైందనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వుండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. అందుకే ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని అన్నారు. శ్రీసిటీని మూడు నగరాలను కలిపే ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందులో తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుపుతూ నెల్లూరు, చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. ఈ ప్రాంతంలో సోమశిల, కండలేరు నీరు ఉండడం వల్ల నీటి సమస్య లేదన్నారు. కృష్ణపట్నం పవర్ ప్లాంటు ఉన్నందున విద్యుత్ సమస్య తలెత్తదన్నారు.

 శ్రీసిటీలో 25 వేల కోట్ల  పెట్టుబడులు
ఇప్పటికే శ్రీసిటీలో 80 కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయని మరో 40 కంపెనీలు నిర్మాణ దశలో వున్నాయని సీఎం అన్నారు. 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయనీ, రూ.25వేల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశస్థాయిలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అంటే శ్రీసిటీ ఒక్కటేనని గుర్తించేలా తీర్చిదిద్దుతామని తెలి పారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో వుండే విధంగా ఆరు నెలల్లో 5 వేల గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రవాణా వ్యవస్థలో శ్రీసిటీకి రైలు, రోడ్డు, జల మార్గాలు, విమానమార్గాలు  అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

శ్రీసిటీలో 1600 మంది గ్రామీణ యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నామని అన్నారు. ప్రస్తుతం 23 హెక్టార్లలో కోకో పండిస్తున్నామని మరో పదేళ్లలో 75వేల హెక్టార్లకు విస్తరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో వుందనీ, చాక్లెట్ ఉత్పత్తులకు అవసరమయ్యే పాల పౌడర్‌కు కొరతలేదని తెలిపారు. శ్రీసిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టూరిజం స్పాట్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. దీనిపై మాండలెజ్ సంస్థ ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. 

కార్యక్రమంలో క్యాడ్‌బరీ సంస్థ ప్రతినిధులు  డేనియల్ మెర్స్, ఆస్కార్‌రంగెల్, చంద్రమౌళి, వెంకటేశన్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, సత్యప్రభ, సుగుణమ్మ, శ్రీసిటీ అధినేతలు రవీంద్రసన్నారెడ్డి, శ్రీనిరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జేసీ  భరత్‌గుప్తా, తిరుపతి సబ్‌కలెక్టర్  ిహ మాంశు శుక్లా, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు