చంద్రబాబుది అనైతిక రాజకీయం

6 Jun, 2015 00:49 IST|Sakshi

 సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు  
 విజయనగరం క్రైం: ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనడం ద్వారా అనైతిక రాజకీయాలకు పాల్పడ్డారని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు పాలన ఏడాది అయిన సందర్భంగా  శుక్రవారం అమర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలంలేని తెలంగాణలో సైతం ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు నీచస్థాయిలో దిగజారుడు రాజకీయాలకు నాంది పలికారన్నారు.
 
  ఎవరిని  ఉద్ధరించేందుకు జూన్ 2న నవ నిర్మాణ దినోత్సవాన్ని జరిపారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సందర్భంగా, సెప్టెంబర్ 5న అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, తోటపల్లి జలాశయాన్ని ఏడాదిలో పూర్తిచేయడం, మెగా అగ్రికల్చరల్ ఫుడ్‌పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్, పోర్ట్, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమి, వైద్య కళాశాల, విజయనగరం స్పార్ట్ సిటీ హామీలిచ్చి కోతల రాయుడిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాదిలోగా పది శాతం హామీలైనా అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబు హామీల మేనిఫెస్టో పత్రాలను ఈ నెల 8న దహనం చేస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గసభ్యులు బుగత సూరిబాబు, బాయి రమణమ్మ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు