అభివృద్ధి పరుగులు పెట్టిస్తా

15 Feb, 2015 01:11 IST|Sakshi
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా

నరసన్నపేట : వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ శ్రీకాకుళం’ పేరిట శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాకు పలు వ రాలు కురిపించారు. ప్రధానం గా భావనపాడు, కళింగపట్నం పోర్టుల అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లాలో మత్య్సకార గ్రామాలు అధికంగా ఉన్నాయని.. తీర ప్రాంతం 130 కిలో మీటర్ల వరకూ ఉన్నందున కోస్టల్ కారిడార్ పేరిట దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.దీనికి కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. మత్య్సకారుల కోసం 7,500 ఇళ్లు నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్ పేరున అనేక పరిశ్రమలను జిల్లాకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
 
 ఇప్పటికే పైడిభీమవరంలో ఫార్మా కంపెనీలు అధికంగా ఉన్నాయని, మరో రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నాలుగు కంపెనీలు ముందుకు వచ్చినట్టు తెలిపారు. దీంతో 10 వేల మందికి ఉపాధి కలుగుతోందన్నారు. శ్రీకాకుళానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, రాష్ట్రంలో 13వ స్థానంలో ఉందని.. దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నుంచి వలసలను తగ్గిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశుమరణాలు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు. వెయ్యి మందికి 49 మంది పిల్లలు చనిపోతున్నట్టు రికార్డులు చెబుతున్నాయన్నారు. అలాగే లక్ష మంది బాలింతలకు 110 మంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
 
 జిల్లాలో 2.44 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేశామన్నారు. రెండో విడతగా మరో 31 వేలమందికి రుణమాఫీ వచ్చే అవకాాశం ఉందన్నారు. జిల్లాలో 1098 పంచాయతీలకు గాను 304 పంచాయతీలను, 187 వార్డుల్లో 37 వార్డులను  దత్తత తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యే బెందాలం అశోక్, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే కావలి ప్రతిబా భారతి, నరసన్నపేట ఎంపీపీ శిమ్మ పార్వతమ్మ, జెడ్‌పీటీసీ సభ్యురాలు చింతు శకుంతల తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు