కేంద్రంపై ముఖ్యమంత్రుల అసంతృప్తి పూర్తిగా కల్పితం

25 Sep, 2019 04:15 IST|Sakshi

ఈనాడు కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఖండన

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ఈనాడు దిన పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం పూర్తిగా కల్పితమని ఏపీ సీఎం కార్యాలయం ఖండించింది. ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో అసలు అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది. ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నదాన్ని పక్కన ఉండి విన్నట్లుగా రాయడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ఊహాజనితమైన ఇలాంటి వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని పేర్కొంది. మంగళవారం సీఎంవో నుంచి విడుదలైన ఖండనలో వివరాలు...  ‘‘ముఖ్యమం త్రుల సమావేశంలో అసలు అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదు. ఊహాజనితమైన అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.

ఈనాడు కథనాన్ని మేం పూర్తిగా ఖండిస్తున్నాం. ఉద్దేశపూ ర్వకంగా రాసిన కథనంగా దీన్ని భావిస్తున్నాం. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు సీఎం సమావేశం సాగింది. గత నాలుగు నెలలుగా ఇరువురు సీఎంల మధ్య భేటీలు జరుగు తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. తాజా భేటీలో గోదావరి జలాల తరలింపు ద్వారా సాగర్‌ కుడికాల్వ కింద  కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయ లసీమకూ, తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా.. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు.

పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలో కూడా శిక్షణ ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర అంశాలు చోటు చేసుకోలేదు. ఈ సమావేశంపై ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం. ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’.   
 

మరిన్ని వార్తలు