ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

20 Jul, 2014 02:09 IST|Sakshi
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

అనంతపురం టౌన్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 24, 25 తేదీల్లో పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. శనివారం డ్వామా మీటింగ్‌హాలులో సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధికారులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం 24న ఉదయం 10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తారు.
 
 అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అనంతరం పుట్టపుర్తి నుంచి వెంగలమ్మ చెరువు, చెర్లోపల్లి, కంబాలపర్తి గ్రామాల్లో పర్యటిస్తారు. నల్లమాడలో రోడ్‌షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి గోపేపల్లి, బొగ్గలపల్లి, కొండమనేనిపాళ్యం వెళ్లి గ్రామాస్తులతో ముఖాముఖి మాట్లాడుతారు. ఆ తర్వాత కదిరిలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుంది. రాత్రికి కదిరిలోనే బస చేస్తారు. 25న లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కదిరి మసీదును సందర్శిస్తారు. అటు నుంచి కాలసముద్రం, మలకవేముల గ్రామాల్లో పర్యటిస్తారు. ముదిగుబ్బలో రైతు, చేనేత సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
 పర్యటన విజయవంతం చేయండి
 సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘం సమావేశానికి మహిళలను తరలించే బాధ్యత డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలను వ్యవసాయ శాఖ జేడీ చూసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ బాధ్యత జెడ్పీ సీఈఓ, డీపీఓ అధికారులు సంయుక్తంగా చేపట్టాలన్నారు.
 
 విద్యుత్, సౌండ్ సిస్టమ్, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాల అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 843 మంది బడిబయట పిల్లలను యూనిఫాం, స్కూల్‌బ్యాగ్స్‌తో తీసుకురావాలని, వీరికి సీఎం చేత అక్షరాభ్యాసం చేయించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. భద్రత ఏర్పాట్లు పోలీసులు చూసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో సీఎంకు నోట్ అందజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ రామస్వామి, డీఆర్వో హేమసాగర్, అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్‌రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 మహిళలకు తర్ఫీదు ఇవ్వండి  
 స్వయం సహాయక సంఘం సభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం అవుతుండడంతో మహిళలకు తర్ఫీదు ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో ఏరియా కో ఆర్డినేటర్, డీపీఎం, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఐకేపీ స్టాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏపీడీ స్వరూప్, సుధాకర్, ఏసీలు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
 
 నేడు మంత్రి పల్లె రాక
 అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటల కు రైల్‌లో బయల్దేరి ఆదివారం ఉదయం 5 గంటలకు అనంతపురం చేరుకుంటారు. మున్సిపల్ అతిథిగృహంలో 9 గంటలకు అధికారులు, అన ధికారులతో సమావేశమవుతారు. సీఎం పర్యటించనున్న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో కలిసి పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులపై చర్చించనున్నారు.
 

మరిన్ని వార్తలు