అగ్రి ఆనందం 

11 Jun, 2019 07:27 IST|Sakshi

సాక్షి,కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అగ్రిగోల్డ్‌ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఊరటనిచ్చారు. ఇన్నాళ్లు ఎందుకూ పనికి రాని మెచ్యూరిటీ బాండ్లకు ముఖ్యమంత్రి జీవం పోశారు. రూ.20 వేలలోపు బాండ్లకు రూ.1150 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని సంబర పడుతున్నారు.  

పది రోజుల్లో పండుగ వచ్చింది... 
అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. దాచుకున్న సొమ్ముకు భద్రత ఉంటుందని, నాలుగు పైసలు వడ్డీ రూపంలో కలసి వస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని  అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశారు. చివరకు బాండ్లకు మెచ్యూరిటీ వస్తున్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో కుమ్మక్కై పేదలను ముంచారు. కంపెనీ అడ్రస్‌ను గల్లంతు చేశారు. బాధితులు రోడ్లెక్కి ఆందోళనలు చేసినా  చంద్రబాబునాయుడు స్పందించలేదు. పైగా అగ్రిగోల్డ్‌ కొన్ని ఆస్తులను కొట్టేయడంలో నారా లోకేష్‌ హస్తం ఉందనే ప్రచారం జరిగింది.

అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ, అసెంబ్లీ బయట అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో పోరాడిన తీరుకు ప్రభుత్వం దిగి వచ్చి రూ.250 కోట్లతో రూ.10 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని యథావిథిగా   అమలు చేయలేకపోయారు. ఇదే క్రమంలోఅధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు.

దీంతో వారందరూ ఆయనకు అండగా నిలిచారు. తనకు అండగా నిలిచిన అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సోమవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రూ.20 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు రూ.1150 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో న్యాయం చేస్తానని పది రోజుల్లో తమకు న్యాయం చేయడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

జిల్లాలో 45 వేల మందికి లబ్ధి... 
జిల్లాలో అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు, చిట్టీలు వేసిన వారి సంఖ్య 75 వేలు. ఇందులో వినియోగదారులు, ఏజెంట్లు ఉన్నారు. కొందరు ఏజెంట్లు బాధితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో దాదాపు 45 వేల మందికి న్యాయం జరుగుతుంది.   

మరిన్ని వార్తలు